ఆడపిల్లకు ఆశయాలు ఎందుకు? అనుకునే సమాజం మనది. చదువో, ఉద్యోగమో అయితే ఒకే కానీ, సాహసకృత్యాలు పూనుకుంటానంటే.. ఆమెను స్వాగతించే గొప్ప మనసు మాత్రం నేటికీ మనకు అంతగా అబ్బలేదు! ఇలాంటి చోట ఓ తండా బిడ్డ సైకిల్ ఎక్కింది. సాహస యాత్రలు చేస్తున్నది. మట్టిని కాపాడమని చెప్పడానికి ఒకసారి ఉద్యమించింది. దేశ రక్షణలో అందరూ భాగమవ్వాలని మరో యాత్ర పూర్తిచేసింది. మహిళా సాధికారతే లక్ష్యంగా మూడో యాత్రనూ పూర్తిచేసింది. 63 రోజుల పాటు సోలోగా సైకిల్ సవారీ చేస్తూ.. తెలుగు రాష్ర్టాలు చుట్టేసిన పంతొమ్మిదేండ్ల బానోతు వెన్నెలను ‘జిందగీ’ పలకరించింది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
మనిషికి సంకల్ప బలం ఉంటే చాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధించొచ్చు. నా సైకిల్ యాత్రలో నేను నమ్మిన సిద్ధాంతం కూడా ఇదే! మాది కామారెడ్డి జిల్లాలోని సోమారంపేట గ్రామ సమీపంలోని రోటిబండ తాండ. మా నాన్న రైతు. సాగుబడిలో దిగుబడి లేక అప్పుల పాలయ్యాడు. అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ భారాన్ని అమ్మ భుజాన వేసుకుంది. చిన్నప్పటి నుంచి నాకు మౌంటెనీరింగ్ అంటే చాలా ఇష్టం. నాన్న మరణంతో నా ఆశలు నీరుగారిపోయాయి అనుకున్నా! కానీ, నా ఊహలకు అమ్మ రెక్కలు తొడిగింది. అమ్మ ప్రోత్సాహంతో ముందడుగు వేశా. మట్టిని నమ్ముకుని జీవించే మాకు ఈషా ఫౌండేషన్ చేపట్టిన ‘సేవ్ సాయిల్’ ఉద్యమం గురించి తెలిసింది. నా వంతుగా వారి ఉద్యమానికి మద్దతు తెలపాలనుకున్నా. ఒక్కదాన్నే సైకిల్ మీద తిరిగి మట్టి గొప్పతనం చెప్పాలనుకున్నా.
అప్పుడు నాకు 17 ఏండ్లు.. బయటి ప్రపంచం గురించి అంతగా తెలియని నేను మట్టి పరిరక్షణ కోసం పాటుపడతానంటే అందరూ వింతగా చూశారు. అయినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. చివరికి సైకిల్ కూడా లేదు. అమ్మ నగలు తాకట్టు పెట్టి సైకిల్ కొనుక్కుని నా ప్రయాణం మొదలు పెట్టాను. 2022లో చేసిన ఈ సైకిల్ యాత్రలో తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల్లో 49 రోజులపాటు 5,000 కిలోమీటర్లు ప్రయాణించి మట్టిని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాను. నా ప్రయాణం గురించి తెలుసుకున్న ఈషా ఫౌండేషన్ సభ్యులు యాత్ర జరిగినన్ని రోజులు వారి ఇండ్లలోనే వసతి కల్పించారు. అమ్మ నగలు విడిపించేందుకు కూడా సహకరించారు.
సైక్లింగ్ మీద ఆసక్తి ఉందని జేడీ లక్ష్మీనారాయణ సార్‌ను సంప్రదించా. నా అపేక్షను గుర్తించిన ఆయన తోడ్పాటునందించారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే 2024లో కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేశాం. మొత్తం 13 మందిమి 23 రోజుల్లో 3,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించాం. దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ పాటు పడాలనే నినాదాన్ని బలంగా తీసుకెళ్లాం. ఈ విధంగా నా రెండో యాత్రను కూడా విజయవంతంగా పూర్తిచేశాను. ఇక మౌంటెనీరింగ్‌పై నా ఆసక్తిని గుర్తించకపోగా, చాలామంది అవహేళన చేశారు. నా ఎత్తు 4.7 అడుగులు ఉండటంతో.. ‘నువ్వేం కొండలు ఎక్కుతావు. మౌంటెనీరింగ్ బ్యాగు బరువే 20 కిలోలు ఉంటుంది. నీ వల్ల ఏమవుతుంది?’ అని అవమానించారు! వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలనే ఇటీవల మరో సైకిల్ యాత్రకు పూనుకున్నా! సమాజంలో నాలాగా ఏదో సాధించాలనుకొని, ఛీత్కారానికి గురవుతున్న ఆడబిడ్డలకు సంఘీభావంగా నిలవాలనుకున్నా. మహిళా సాధికారతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గత జూన్ 14న నా సైకిల్ యాత్ర ప్రారంభించాను.
హైదరాబాద్‌లో మొదలైన నా యాత్ర ఏపీ, తెలంగాణలోని అన్ని జిల్లాలనూ కవర్ చేస్తూ సాగింది. 63 రోజులపాటు దాదాపు 3,600 కిలోమీటర్లు ప్రయాణించి కరీంనగర్లో యాత్ర ముగించాను. ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించడానికి సోలో యాత్ర చేపట్టాను. ఈ ప్రయాణంలో మంచి-చెడు రెండు అనుభవాలూ ఎదురయ్యాయి. నా పట్టుదల చూసి ‘శభాష్’ అన్నవాళ్లు ఉన్నారు, ‘ఆడపిల్లవు నీకెందుకు ఇవన్నీ?’ అని పెదవి విరిచిన వాళ్లూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో నా యాత్ర విశేషాలు పోస్టు చేసినప్పుడు చాలామంది అమ్మాయిలు నా ఫోన్ నంబర్ అడిగి తీసుకొని మాట్లాడారు. ‘మాకు నీలాగే స్వేచ్ఛగా బయటకొచ్చి మా శక్తేంటో నిరూపించాలని ఉంది. కానీ, ఇంటి నుంచి స్వేచ్ఛగా కాలు కూడా బయటపెట్టలేకపోతున్నాం’ అన్నారు. మొదటి రెండు యాత్రల కన్నా.. మూడోది ప్రత్యేకం అనిపించింది. అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నా! రాత్రుళ్లు దేవాలయాలు, సత్రాల్లో పడుకునేదాన్ని. పెట్రోలు బంకుల్లో సీసీ కెమెరాల ఎదురుగా టెంట్ వేసుకొని ఉండేదాన్ని. వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. రాత్రుళ్లు కొన్నిసార్లు భయం వేసేది. నా ప్రతి మూమెంట్‌ను మా అన్నకు లైవ్ లొకేషన్ పెట్టేదాన్ని! ఎలాగైతేనేం.. అనుకున్న లక్ష్యం పూర్తిచేయగలిగాను. సైక్లింగ్ నా జీవితంలో భాగమైపోయింది. భవిష్యత్తులోనూ మరిన్ని యాత్రలు చేపడతా! హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వతాలపై సైకిల్ మౌంటెనీరింగ్ చేయాలన్నది నా లక్ష్యం. అది ఖర్చుతో కూడుకున్నదే అయినా.. సాధించి తీరుతాను!
నా పర్వతారోహణ కల 2022లోనే సాకారమైంది. సేవ్ సాయిల్ నినాదంతో నేను చేసిన సైకిల్‌యాత్ర గురించి తెలుసుకున్న సంతోష్‌రావు పర్వతారోహణ చేసేందుకు నాకు ఆర్థిక సహకారం చేశారు. భువనగిరి కొండపై ట్రైనింగ్ తీసుకున్నా. శిక్షణ తర్వాత కిలీమంజారో పర్వతారోహణకు బయల్దేరాను. ఐదు రోజుల్లో అధిరోహించాను. చిన్నప్పటినుంచే సాహస యాత్రలు అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో మంచి అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ పెట్టాలన్నదే నా కోరిక…