ముత్తు అలియాస్ కాట్టన్
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: విజయ్ సేతుపతి, మిలింద్ సోమన్, అభి నక్షత్ర, రిషా జాకబ్స్, పార్వతి, ముత్తు కుమార్, సింగంపులి, వడివేల్ మురుగన్, బాలాజీ శక్తివేల్ తదితరులు,
దర్శకత్వం: మణికందన్
ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలకు మించిన పోటీ ఉంటున్నది. ప్రతివారం ఏదో ఒక కొత్త కథతో వస్తేనే.. ఆయా చానెళ్లకు మనుగడ ఉంటుంది. లేకుంటే.. వ్యూస్ తగ్గిపోయి, రేటింగ్స్ పడిపోయే ప్రమాదం ఉంది. అందులోనూ, ఓటీటీని ఎక్కువగా ఇష్టపడే నవతరం.. ప్రతి కథలోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నది. నచ్చక పోతే.. వెంటనే వేరే ప్లాట్‌ఫామ్‌కి షిఫ్ట్ అయిపోతున్నది. వారికోసమే ఊహలకు అందని ట్విస్ట్‌లు, టర్నింగ్‌లతో వెబ్‌సిరీస్‌లు రూపొందుతున్నాయి. అలాంటి ఓ సరికొత్త వెబ్ సిరీస్.. ముత్తు అలియాస్ కాట్టన్. దక్షిణాదిలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి.. ఈ సిరీస్‌లో నటించి, స్వయంగా నిర్మించాడు కూడా. ఇక జాతీయ అవార్డు అందుకున్న మణికందన్ దర్శకత్వం వహించాడు. రివేంజ్ థ్రిల్లర్ డ్రామాగా, 10 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్.. తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. రికార్డు వ్యూస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నది.
కథలోకి వెళ్తే.. అటవీ ప్రాంతంలోని ఓ ఊరి నేపథ్యంలో సాగుతుంది. మూడేళ్లుగా.. అక్కడి పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాదు. దాంతో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌ను ఎత్తేయాలని అధికారులు నిర్ణయిస్తారు. అదే స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే కాళి పాండియన్ (వడివేల్ మురుగన్)ది అదే ఊరు. స్టేషన్‌ను అక్కడి నుంచి తరలిస్తే.. తాను మరో ఊరికి బదిలీ కావాల్సివస్తుందని భయపడతాడు. ఇలాంటి సమయంలో.. ఒకరోజున మొండెం లేని తల ఒకటి ఆ ఊళ్లో దొరుకుతుంది. ఈ కేసును ఎస్ఐతోపాటు కాళిపాండియన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. వారి విచారణలో భాగంగా..
ఆ చనిపోయిన వ్యక్తి పేరు ముత్తు అలియాస్ కాట్టన్ (విజయ్ సేతుపతి) అని తెలుసుకుంటారు. అయితే, పోలీసులకు ముత్తు గురించి ఒక్కొక్కరూ ఒక్కో కథ చెబుతారు. ఇంతకూ ఈ ముత్తు ఎవరు? రకరకాల వృత్తులు ఎందుకు చేస్తాడు? కేరళ మినిస్టర్ బెన్నీ, గ్యాంగ్‌స్టర్ శివన్న (మిళింద్ సోమన్)తో ముత్తుకు ఉన్న సంబంధం ఏమిటి? ముత్తు పెళ్లి చేసుకోవాలని ఆశపడిన సింధు ఎలా చనిపోయింది? ముత్తు జీవితంలోకి వచ్చిన మీనా ఎవరు? జాతరలో జరిగిన జంట హత్యలకు ముత్తుకు ఏం సంబంధం ఉంది? అసలు ముత్తు ఎలా చనిపోయాడు? తన మరణం వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు కనిపెట్టారా? అన్నదే..
ఈ వెబ్ సిరీస్ కథ.