Mrunal Thakur | డ్రైవింగ్ చేసేటప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నదని అందాలతార మృణాల్ ఠాకూర్. వాహనాలు నడిపేటప్పుడు హెయిర్ క్లచ్‌లు ధరించొద్దని సలహా ఇస్తున్నది. తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్.. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. పరిశ్రమతోపాటు పర్సనల్ విషయాలనూ అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ.. ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో అమ్మాయిలు జుట్టు ముడి వేసుకోవడానికి వాడే హెయిర్ క్లిప్.. డ్రైవింగ్ సమయంలో ఎలా ప్రమాదం తెచ్చిపెడుతుందో చూపించింది. ఈ క్లిప్ వెనుక సీట్‌కి తగిలి తలలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉన్నదనీ, కాబట్టి కారు నడిపేటప్పుడు ఇలాంటివి ధరించవద్దని కోరింది.
‘చిన్నచిన్న యాక్ససరీలే పెద్ద అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కారు ప్రమాదం జరిగినప్పుడు మరింత నష్టం చేస్తాయి. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఉపయోగించకుండా ఉండటమే మంచిది’ అంటూ చెప్పుకొచ్చింది. మృణాల్ పెట్టిన పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తున్నది. హిందీ సీరియల్స్‌లో మెరిసిన మృణాల్ ఠాకూర్.. హనూ రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’తో టాలీవుడ్‌కు పరిచయమైంది.
ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. అన్ని భాషల్లోనూ ఆఫర్లు అందుకుంటూ.. టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్నది. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’లో హీరోయిన్గా నటిస్తున్నది. బాలీవుడ్‌లోనూ సన్ ఆఫ్ సర్దార్ 2, సిద్ధాంత్ చతుర్వేది చిత్రం సహా పలు క్రేజీ ప్రాజెక్టులతో మృణాల్ ఠాకూర్ బిజీగా ఉన్నది!