గ్రామీణ మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడంలో.. మహిళా బిజినెస్ కరస్పాండెంట్లు కీలకంగా మారుతున్నారు. వీరు బ్యాంకుల తరఫున రిమోట్ ఏరియాల్లోని కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను అందిస్తుంటారు. పురుష ఏజెంట్లతో పోలిస్తే.. వీరు 66 శాతం ఎక్కువగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తాజా నివేదిక ఒకటి తెలిపింది. పే నియర్‌బై, గ్రామీణ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ సంయుక్తంగా ఇటీవల ఓ సర్వే నిర్వహించింది.
ఈ సందర్భంగా 12 రాష్ర్టాల్లోని 1,862 మంది బిజినెస్ కరస్పాండెంట్ల నుంచి వివరాలు సేకరించింది. మహిళలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో పురుష ఏజెంట్ల కన్నా.. మహిళా బిజినెస్ కరస్పాండెంట్లే ముందున్నారని ఇందులో తేలింది. అయితే, మహిళల ఆర్థిక ప్రగతికి మార్గదర్శకంగా ఉంటున్న ఈ ఏజెంట్లు.. క్షేత్ర స్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారట.
ఇప్పటికీ 60 శాతం మంది మహిళా బిజినెస్ కరస్పాండెంట్లు.. తమ వృత్తిపరమైన, వ్యక్తిగత బాధ్యతలను సమతుల్యం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారట. 33 శాతం మంది భద్రతాపరమైన ఆందోళనలకు గురవుతున్నారనీ, 35 శాతం మంది సాంస్కృతిక – సామాజిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారనీ అధ్యయనం వెల్లడించింది.
గ్రామీణ మహిళల ఆర్థికరంగానికి ఊతంగా నిలుస్తున్న మహిళా కరెస్పాండెంట్లకు తగిన గుర్తింపు దక్కడం లేదని సర్వే ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగంలో లింగ వివక్షను తగ్గించడం, వృత్తిపరమైన అనుకూల వాతావరణాన్ని కల్పించాలని సూచిస్తున్నారు. అప్పుడే.. గ్రామీణ మహిళలకు మరిన్ని ఆర్థిక ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.