వంటకాలకు సువాసనలు అద్దే పుదీనాను ఇష్టపడని వారు ఉండరు. శరీరానికి చల్లదనంఅందించే ఆకుగానే దీన్ని భావిస్తారు. అయితే, పుదీనాతో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు, చర్మ సంరక్షణలో పుదీనా కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణుల మాట. ఇందులో ఉండే కెరోటిన్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. పుదీనాను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. బహుముఖ ప్రయోజనాలు కలిగించే పుదీనాలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. ఐరన్ లోపాన్ని కూడా పుదీనా నియంత్రిస్తుంది. వంటలు, పచ్చళ్లు, నిమ్మరసం, మజ్జిగలో పుదీనా ఆకులు వాడటం వల్ల… జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అజీర్తి సమస్య దూరమవుతుంది. ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇతర మూలికల కన్నా ఈ విషయంలో పుదీనా విశేషంగా పనిచేస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అంతేకాదు, పుదీనా వాడకం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.