పాప్ ప్రపంచపు రారాజు మైకేల్ జాక్సన్ కూతురు కూడా ఆయనలాగే విభిన్న అభిరుచులు కలిగిన వ్యక్తి. గాయని, నటి, మోడల్‌గా రాణించడమేకాదు ఆహార్యంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుతుంటుంది. శరీరాన్ని టాటూలతో అలంకరించుకోవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అయితే, ఆఫ్రో అమెరికన్ అయిన ఆమె దేహం మీద దేవనాగరి లిపిలో రాసిన వివిధ టాటూలు ఉండటం ఆకర్షించే విషయం.
పారిస్ జాక్సన్‌కు ఆటపాట తండ్రి నుంచే అందాయి. ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్‌లో ఉన్నప్పుడు ఆమె కడుపులో పడ్డట్టుగా తెలియడంతో ఆమెకు ఆ నగరపు పేరునే పెట్టాడట మైకేల్ జాక్సన్. అలా పుట్టుకతోనే విభిన్నతను సంతరించుకున్న పారిస్ జాక్సన్, పెద్దయ్యాకా అదే పంథాలో సాగింది. చర్చికి వెళ్లే అలవాటున్న ఆమె, తను గాడ్ పేరెంట్‌గా పిలిచే ఒక నటుడి ద్వారా హిందూ, బౌద్ధ మతాల వైపు ఆకర్షితురాలైంది. ఆ క్రమంలోనే ఆమెకు దేవనాగరి లిపి, యోగ సంప్రదాయంలో ఉండే చక్రాలు తదితరాలతో పరిచయం ఏర్పడింది. ఆమె ఇప్పటిదాకా 80కి పైగా టాటూలు వేసుకుంది. అందులో వీటికీ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.
పారిస్ జాక్సన్‌కు చిన్ననాటి నుంచే టాటూలంటే అమితమైన ఇష్టం. తండ్రి జ్ఞాపకార్థం అతని ఆల్బమ్‌ల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకుంది. 36 ఏండ్ల వయసులో అతను గతించాడని అర్థం వచ్చేలా… ‘ఫర్ ఎవర్ 36’ అనే టాటూ వేయించుకుంది. తన 18వ పుట్టిన రోజుకు ‘ద క్వీన్ ఆఫ్ మై హార్ట్’ (నా హృదయపు రాణి) అనే అర్థం వచ్చేలా మైకేల్ జాక్సన్ చేతిరాతతో చేతి మీద ముద్రించుకుంది. ఇలా తను జీవితంలో ప్రత్యేకం అనుకున్న వాటిని, నమ్మకాలను మేని మీద అచ్చేసుకోవడం ఆమెకు అలవాటు.
13
అందులో భాగంగానే మన సంప్రదాయంలో చెప్పే, శరీరంలో ఉండే ఏడు చక్రాలను శరీరం మీద పచ్చబొట్టుల్లా వేయించుకుంది. మూలాధార, స్వాధిష్ఠాన మొదలు ఆజ్ఞా, సహస్రార వరకు ఏడు చక్రాలు, వాటికి సంబంధించిన రంగులు, సంస్కృత అక్షరాలను ఆమె ఒంటి మీద చూడొచ్చు. వెన్నెముక మీద అలాగే మెడకింది నుంచి పొట్ట దాకా కూడా వీటిని రెండు వైపులా వేయించుకుంది. మరో సందర్భంలో ‘జై గురుదేవ్’ అనీ పక్కనే ‘ఓం’ అనీ దేవనాగరి లిపిలో రాయించుకుంది.
భుజం మీద కూడా అవే అక్షరాల్లో ‘తత్ర దేవస్య తు అనుగ్రహాయ గచ్ఛ’ అనే మరో వాక్యం కనిపిస్తుంది. ఆమె ఎప్పుడెప్పుడు ఏయే భావనలు, అనుభూతులకు లోనైతే వాటిని ఇలా తన శరీరం మీద శాశ్వతంగా అమరేలా అచ్చుగా వేసుకుంటుందట. అమెరికన్ మోడల్, మైకేల్ జాక్సన్ ఏకైక కుమార్తె అయిన ఆ అమ్మాయి దేహంపై మన భారత సంప్రదాయాలను ప్రతిబింబించేలా రకరకాల చిహ్నాలు, అక్షరాలు కనిపించడం తొలిసారి చూసిన ఎవరికైనా చిత్రమైన విషయంలానే అనిపిస్తుంది… ఏమంటారు!