మామిడిపండు రంగు బంగారం. మామిడిపండు రుచి బంగారం. అదే మామిడి బంగారంతో రూపు దిద్దుకుంటే! చూపు తిప్పుకోలేం. పండ్లలో రారాజు ఆమ్రఫలం. ఆభరణాల్లోనూ మామిడిపిందెల హారాలకు అంతే ప్రాధాన్యం.మగువల మనసు దోచేస్తున్న ‘మామిడి పిందె నగల’ ధగధగలేంటో మనమూ చూద్దాం.
పెండెంట్ ప్రత్యేకం
పొడవైన హారాలకు భారీ పెండెంట్లు జత చేస్తుంటారు. ఈ పెండెంట్ చుట్టూ చిన్నచిన్న మామిడి పిందెల డిజైన్లు చెక్కి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పెండెంట్లో వజ్రాలు, ముత్యాలు, ఒకే రకం రాళ్లు పొదిగిన డిజైన్లు సంప్రదాయంగానే కాకుండా, ఆధునికంగానూ కనిపిస్తాయి. అంతేకాకుండా హారం సైజుకి సరిపోయేలా పెండెంట్ సైజు, డిజైన్‌ను ఎంచుకుంటే బాగుంటుంది. సాధారణంగా హారం డిజైన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, పెండెంట్ గురించి పట్టించుకోరు చాలామంది. కానీ, పెండెంట్ వల్లే హారం అందంగా కనపడుతుంది. అందుకే, హారం అందాన్ని రెండింతలు చేసే పెండెంట్లను ఎంచుకోవాలి.
బంగారమే కాదు..
లోహాలతో తీర్చిదిద్దిన నగల్లోనూ మామిడి పిందెల డిజైన్లు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా టెర్రకోట మట్టి నగలు, వెండి, ఫ్యాబ్రిక్, థ్రెడ్ జువెలరీలోనూ ఈ డిజైన్లు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతిని ఆరాధించే ఆదివాసీల నగల్లోకూడా మామిడి పిందెల డిజైన్లు గమనించవచ్చు. వారు ధరించే ముత్యాలు, పగడాలు, నల్లపూసలకు తోడుగా వెండితో చేసిన మామిడి పిందెల డిజైన్లను అలంకరించుకుంటారు. పెద్దపెద్ద హారాలు, నెక్లెస్లే కాకుండా ప్లాస్టిక్, రబ్బరుతో చేసిన చిన్నచిన్న చెవి దుద్దులు, బ్రేస్లెట్లలోనూ మామిడి పిందెల ఆకారాలు అమరిపోతున్నాయి. వీటిని కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారూ చక్కగా
ధరించవచ్చు.
ఆపాద మస్తకం
భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో పండ్లకు పెద్దపీట వేస్తారు. నగల్లోనూ ‘మామిడి పిందెల డిజైన్ల’ను శుభప్రదంగా భావిస్తారు. అందుకే, పెండ్లికూతురి నగల్లో ఈ డిజైన్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా వంకీలు, వడ్డాణాల్లో మామిడి పిందెల డిజైన్లదే హవా. పాపిట బిళ్లనుంచి కాళ్ల పట్టీలవరకు అన్నిట్లోనూ ఈ డిజైన్ ప్రత్యేకమే. అందుకే, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చెవి దుద్దులు, గాజులు, పట్టీల విషయంలోనూ మామిడి పిందెల డిజైన్‌కే ఓటేస్తారు. కొందరు సాదాసీదా డిజైన్లను ఎంచుకుంటే, మరికొందరు వీటిపై ఆకులు, గీతలు, చుక్కల వంటి డిజైన్లను వేయించుకుంటారు.
ఫలరాజు మామిడి వేసవిలోనే అందుబాటులో ఉంటుంది. కానీ, ఆ పండును రుచి చూడాలని ఏడాదంతా ఎదురు చూస్తుంటాం. ఆమ్రఫలం రుచి మాత్రమే కాదు, రూపమూ ప్రత్యేకమే. గోళాకృతి కొంత, కోలాకృతి ఇంకొంత కలగలిసి.. చివరాఖరున వంపు తిరిగి సొంపులొలికే మామిడి పండు ఆకారం సృష్టికర్త సృజనాత్మకతకు ఉదాహరణ. అందుకే, ఈ మామిడి ఆకృతిని ఆదర్శంగా తీసుకొని మన పూర్వికులు నగలను సృష్టించారు. తరతరాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన ‘మామిడి పిందెల డిజైన్’.. హారాలుగా, నెక్లెస్లుగా, దుద్దులుగా రకరకాల రూపాల్లో అతివల మనసులను ఆకట్టుకుంటున్నది.
అమ్మమ్మల నుంచీ ఆధునిక అమ్మాయిల వరకూ అందరిని అలరిస్తున్న డిజైన్ ‘మామిడి పిందెలు’. పెండ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు వంటి వేడుకల్లో మామిడి పిందెల నగలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాలానుగుణంగా ఈ డిజైన్లకు మరిన్ని హంగులద్ది సరికొత్తగా అందిస్తున్నారు తయారీదారులు. పూసలు, ఎమరాల్డ్స్ను పొదిగి ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టుచీరలపైకి చూడచక్కగా కనిపించే ఈ నగలు ప్లెయిన్ సారీస్, అనార్కలి డ్రెస్లపైనా అంతే హొయలొలికిస్తాయి.
జతగా జాతిరత్నాలు
మామిడి పిందెల హారంలో ప్రధానంగా గోమేధికం, ముత్యాలు, పగడాలు, వజ్రాలు వంటి జాతిరత్నాలను పొదుగుతారు. ఇలాంటి హారాలు కంఠాభరణాలుగాకంటే, పొడవైన హారాలుగానే బాగుంటాయి. హారం చుట్టూ అమర్చిన మామిడి పిందెల్లో ఒక్కో రత్నం విడివిడిగా పొదిగి ఉన్న డిజైన్లు మరింత చక్కగా కనబడతాయి. హారం మొత్తం అన్‌కట్ డైమండ్స్ పొదిగితే ఇంకొంత నిండుగా కనిపిస్తుంది.