ఓటీటీలో హిట్ కొట్టాలంటే.. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండాల్సిందే! మిస్టరీ, క్రైమ్, మైథాలజీ, సైకలాజికల్ లాంటి జానర్లు జతచేసి.. ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచాల్సిందే! అప్పుడే.. ‘సిరీస్’ బ్లాక్‌బస్టర్ అవుతుంది. అలాంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిందే.. మండల మర్డర్స్! ప్రముఖ నిర్మాణసంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్‌తో కలిసి.. నెట్‌ఫ్లిక్స్ ఈ సరికొత్త సిరీస్‌ను నిర్మించింది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో మొత్తం 8 ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్కు వచ్చింది. హిట్‌టాక్‌తో రికార్డు వ్యూలను కొల్లగొడుతున్నది. కథలోకి వెళ్తే.. 1952లో ఉత్తరప్రదేశ్‌లోని ‘చరణ్‌దాస్‌పూర్’ గ్రామం నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ ఊరికి దగ్గర్లలోని ‘వరుణ అడవి’లో రుక్మిణి అనే మంత్రగత్తె ఉంటుంది.
శత్రువులపై పగ తీర్చుకోవడానికి తనను ఆశ్రయించేవారి కోరికలను క్షుద్రశక్తులతో తీరుస్తుంటుంది. ఈ క్రమంలో చరణ్‌దాస్‌పూర్ గ్రామవాసులంతా కలిసి.. ఆ మంత్రగత్తెను అడవి నుంచి తరిమివేస్తారు. అదే ఊరివాడైన విక్రమ్ సింగ్ (వైభవ్‌రాజ్ గుప్తా).. ఆ సమయంలోనే ఢిల్లీకి వెళ్లిపోతాడు. అక్కడే పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కొన్ని కారణాలతో విక్రమ్ సస్పెన్షన్‌కు గురవుతాడు. దాంతో తన తండ్రిని వెంటబెట్టుకుని స్వగ్రామానికి వస్తాడు. 20 ఏళ్ల కింద అనారోగ్యంతో బాధపడుతున్న తన తమ్ముడిని.. పిన్నిని తీసుకుని ‘వరుణ అడవి’లోకి వెళ్లిన తన తల్లి తిరిగి రాలేదనే విషయం అతనికి అప్పుడు స్పష్టమవుతుంది. తన స్నేహితుడైన ప్రమోద్ సాయంతో తల్లి ఆచూకీ కనిపెట్టాలని విక్రమ్ నిర్ణయించుకుంటాడు. మరోవైపు.. అప్పుడే ఎన్నికలు మొదలవుతాయి. స్థానిక రాజ కుటుంబీకురాలైన అనన్య భరద్వాజ్ (సుర్విన్ చావ్లా) ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది.
అదే సమయంలో ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ దారుణ హత్యకు గురవుతాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దాంతో, ఆ మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ ఆఫీసర్ రియా థామస్ (వాణీ కపూర్) ఆ ఊరిలో అడుగుపెడుతుంది. అయితే, కేసును విచారిస్తున్న సమయంలోనే.. మరిన్ని దారుణ హత్యలు జరుగుతాయి. మరి.. ఈ కేసులను రియా ఎలా పరిష్కరించింది? ఇన్వెస్టిగేషన్లో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? విక్రమ్ తన తల్లిని కలుసుకుంటాడా? 20 ఏళ్లకిందటి మంత్రగత్తెలకు.. ఇప్పటి తాజా సంఘటనలకు మధ్య ఉన్న ఏమైనా సంబంధం ఉన్నదా? అనేది తెలియాలంటే.. సిరీస్ చూడాల్సిందే!
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: వాణీ కపూర్, సుర్విన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్, వైభవ్ రాజ్‌గుప్తా, జమీల్ ఖాన్ తదితరులు
దర్శకత్వం: గోపి పుత్రన్ – మానన్ రావత్