ఐ, నోబడీ
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు, హక్కీమ్ షాజహాన్, విజయ రాఘవన్, అశోకన్ తదితరులు
దర్శకత్వం: నిషమ్ బషీర్
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో ‘బ్యాంక్ హైస్ట్ డ్రామా’లు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఆర్థిక నేరాలు, బ్యాంక్ దోపిడీల చుట్టూ తిరిగే కథనాలతో.. ప్రేక్షకులను ఆసాంతం అలరిస్తాయి. ఇలాంటి బ్యాక్‌డ్రాప్ కథకు.. కుటుంబ బాధ్యతలు, సమాజపు పోకడలను జోడిస్తూ.. మలయాళంలో తెరకెక్కింది ‘ఐ, నోబడీ’ చిత్రం. మలబారు తీరంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. తాజాగా జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చింది. ఇక్కడా రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతున్నది. కథలోకి వెళ్తే.. రాజీవన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఓ ప్రభుత్వ ఉద్యోగి.
సెక్రటేరియట్లో పని చేస్తుంటాడు. అతని భార్య మీరా (పార్వతి తిరువోతు) ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటుంది. ఉద్యోగంతోపాటు ఇంటి పనులు, ఇద్దరు ఆడపిల్లలు (జియా, అమల) బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. అయితే.. రాజీవ్, మీరాల మధ్య సఖ్యత ఉండదు. ఇద్దరి మధ్యా మాటలు కూడా ఉండవు. మౌనంగా సాగిపోతున్న వీరి జీవితంలో.. ఒక బ్యాంక్ దోపిడీ మరో పెద్ద అలజడిని రేపుతుంది. ఒకరోజు రాజీవన్ బ్యాంక్‌కు వెళ్లిన సమయంలోనే.. ఆ బ్యాంక్ దోపిడీకి గురవుతుంది. అక్కడికి వచ్చిన దొంగలు.. రాజీవన్‌ను కిడ్నాప్ చేసి, అక్కణ్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ, వాళ్ల ప్లాన్ బెడిసి కొట్టి, రోడ్డు ప్రమాదానికి గురవుతారు.
మరోవైపు దొంగిలించిన రూ. 17 కోట్ల ఆచూకీ దొరక్కుండా పోతుంది. ఇలా ఉండగా.. రాజీవన్కూ ఆ దోపిడీలో భాగం ఉందని, బ్యాంక్ నుంచి కొట్టేసిన రూ. 17 కోట్లు అతని వద్దే ఉన్నాయనే పుకార్లు బయటికి వస్తాయి. దాంతో, పోలీసులు, తోటి ఉద్యోగులు, చుట్టూ ఉండే సమాజమంతా రాజీవన్‌ను మానసికంగా వేధిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో.. సమాజపు మానసిక వేధింపుల నుంచి రాజీవన్ ఎలా తప్పించుకుంటాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? ఈ గొడవల మధ్య మీరా ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆ తర్వాత రాజీవన్ జీవితం ఏ మలుపు తిరిగింది? అసలు తనకు ఖాతానే లేని బ్యాంక్‌కు రాజీవన్ ఎందుకు వెళ్లాడు? బ్యాంక్‌లో దొంగిలించిన డబ్బు ఏమైంది? మీరా-రాజీవన్ మధ్య గొడవలకు కారణం ఏంటి? చివరికి వీరి జీవితం సాఫీగా సాగిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!