జీవనశైలి లోపాలు.. నవ దంపతులకు శాపంగా మారుతున్నాయి. చిన్న వయసులోనే లేనిపోని ఆరోగ్య సమస్యలను తీసుకొస్తున్నాయి. క్రమంగా.. వారిని వంధ్యత్వంవైపు నడిపిస్తున్నాయి. సంతానం కోసం ‘ఐవీఎఫ్’ కేంద్రాలను ఆశ్రయించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం కృత్రిమ గర్భధారణ కోసం వస్తున్న జంటల్లో.. దాదాపు 15 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఒక దశాబ్దం కిందటి దాకా.. ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించే జంటలలో 95 శాతం మంది 30 ఏళ్లు పైబడినవారే! కానీ, ఇప్పుడు.. యుక్త వయసులోనే.. కృత్రిమ గర్భదారణ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
యువతలో వంధ్యత్వం పెరగడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్యపరమైన సమస్యలతోపాటు జీవనశైలి లోపాల వల్ల.. ఈ సమస్య ఎదురవుతున్నదని అంటున్నారు. దాదాపు మూడింట ఒక వంతు మందిలో జీవనశైలి లోపాలతోపాటు పర్యావరణ కాలుష్యంతోనే వంధ్యత్వం పెరుగుతున్నదని పేర్కొంటున్నారు. అమ్మాయిల్లో పీసీఓఎస్, అండాశయ సమస్యలు కనిపిస్తుండగా.. అబ్బాయిలను అజోస్పెర్మియా (వీర్యంలో శుక్రకణాలు లేకపోవడం), పేలవమైన స్పెర్మ్ ఆరోగ్యం లాంటివి వేధిస్తున్నాయి. ఇక పోషకాహార లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి, క్రమరహిత నిద్ర, ధూమపానంతోపాటు నగర కాలుష్యానికి గురికావడం లాంటి సమస్యలు ఇద్దరిలోనూ కామన్‌గా కనిపిస్తున్నాయి.
ఇవన్నీ కలిసి వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా.. చిన్నవయసులోనే ‘ఐవీఎఫ్’ కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. అదే సమయంలో కెరీర్ కారణాల వల్ల పిల్లల్ని కనడం వాయిదా వేసుకునే జంటలూ పెరుగుతున్నాయి. ఇలాంటి వాళ్లు కూడా ఐవీఎఫ్‌ను ఎంచుకుంటున్నారు. సంతానోత్పత్తి సంరక్షణ కోసం అండం లేదా స్పెర్మ్ ఫ్రీజింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో పిల్లలను కనడానికి.. సంతానోత్పత్తిని ప్రభావితం చేసే సమస్యలు తలెత్తినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.