ఉగాది.. అదే యుగాది. యుగ, ఆది పదాల కలయిక ఇది. నూతన యుగానికి నాంది పలికిన తిథే ఉగాది పర్వదినం. వేర్వేరు కాలాలకు చెందిన వివిధ రుషులు ‘యుగం’ అన్న పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు. ‘యుగ’ అన్న ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుంచి మళ్లీ వచ్చే చైత్రం వరకు గల సమయాన్ని ఒక ‘యుగం’ అని పేర్కొన్నారు.
Ugadi | విష్ణుమూర్తి.. మత్స్యావతారం ధరించి సోమకుని వధించి అతను అపహరించిన వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్సరంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి అయిన ఉగాది రోజే సృష్టి ఆరంభమైందని పురాణ కథనం. అందుకే మనకు ‘చైత్ర’ మాసంతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని కలిగించి, మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే పర్వం ‘ఉగాది’.
ప్రస్తుత ఉగాది కలియుగ ఆరంభాన్ని సూచిస్తుంది. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు తన భౌమ లీలలను ముగించగానే కలియుగం ప్రారంభమైంది.
యస్మిన్కృష్ణో దివం యాతస్తస్మిన్నేవ తదాహని
ప్రతిపన్నం కలియుగమితి ప్రాహుః పురావిదః
– శ్రీమద్భాగవతం 12.2.33
కృష్ణ భగవానుడు వైకుంఠానికి వెళ్లిన రోజే కలియుగం ఆరంభమైందని కాలాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన ప్రాచీన పండితులు వివరించారు.
కలహ, కల్మషాలతో కూడిన కలియుగాన్ని ‘ఇనుప యుగం’గా చెబుతారు. కలియుగం ఎన్నో దుఃఖాలకు నిలయమైనప్పటికీ, దీనికి అద్భుతమైన లక్షణం ఒకటి ఉన్నదని శ్రీమద్భాగవతం పేర్కొన్నది.
కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్గుణః
కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసఙ్గః పరం వ్రజేత్
– శ్రీమద్భాగవతం 12.3.51
‘రాజా! కలియుగం దోషసాగరం అయినప్పటికీ దీనిలో ఒక మహాగుణం ఉంది. అదేంటంటే.. కేవలం హరేకృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా మనుషులు భవబంధ విముక్తులై పరంధామానికి చేరగలుగుతారు’ అని భాగవతం స్పష్టం చేసింది. అటువంటి నామ మహిమను చాటడానికే అవతరించారు శ్రీ చైతన్య మహాప్రభు. హరినామ సంకీర్తన ఉద్యమానికి నాంది పలికారు. కృష్ణ నామామృతాన్ని ఊరూవాడా ప్రచారం చేసి… ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపజేశారు.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984