బయటి ప్రపంచంలో ఉండే అన్నిటికీ ఫ్యాషన్ ప్రపంచంలోనూ చోటు ఉంటుంది. చెట్టూ పిట్టా మానూ మనిషీ… ఇలా అన్నీ అందులోనూ స్థానాన్ని సంపాదించుకుంటాయి. మరి పురుగులు మాత్రం అందులో భాగం కాదా ఏంటి?.. అనుకున్నట్టున్నారు డిజైనర్లు. లేడీబగ్ నోస్ పిన్, ఇయర్ రింగ్స్‌ను తీర్చిదిద్దారు. ఎరుపు రంగు పైభాగంలో నలుపు రంగు చుక్కలతో ఉండే పురుగును లేడీబగ్గా పిలుస్తారని తెలిసిందే.
ఇవి ఎక్కువగా గడ్డిలో, చిన్నచిన్న పూల మొక్కల మీదా కనిపిస్తాయి. అచ్చం అలాంటి ఆకృతిలోనే ఎరుపు రంగు ఎనామిల్ మీద, నలుపు రంగు చుక్కలను పెట్టి దుద్దులు, ముక్కు పుడకలు తయారు చేస్తున్నారు. చిన్నాపెద్దా అని లేకుండా ఎవరు కాస్త వెరైటీ ఫ్యాషన్‌ని కోరుకుంటారో వాళ్లు వీటిని ధరించేస్తున్నారు. మొత్తానికి లేడీబగ్ లేడీస్ స్ట్రీట్‌లో అడుగు పెట్టిందన్నమాట!