సోమవారం 26 అక్టోబర్ 2020
Zindagi - Aug 13, 2020 , 22:29:59

మీ వంటిల్లు.. శుభ్రమేనా?

మీ వంటిల్లు.. శుభ్రమేనా?

ఘుమఘుమలు వెదజల్లే వంటిల్లు శుభ్రంగా ఉందా! దానికేం పరిశుభ్రంగా ఉందని అనేయకండి. కంటికి కనిపించని ఎన్నో క్రిములు వంటింటి మూలమూలలో దాక్కుంటాయి. ఆశ్చర్యమేమంటే.. టాయ్‌లెట్‌ సీటు కన్నా ఎక్కువ బ్యాక్టీరియా వంటింట్లో ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. అమ్మ బాబోయ్‌! అని కంగారుపడకండి. ఈ చిట్కాలు పాటించి.. వంటింటిని శుభ్రంగా ఉంచుకోండి.

పనంతా అయిపోయాక వంటగదిని చక్కబెట్టడం, కౌంటర్లను తుడవడం, సింక్‌లను స్క్రబ్‌ చేయడం అన్నీ చేస్తాం. అయినా బ్యాక్టీరియా మిగిలే ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే మనం కూరగాయలు, మాంసం కడిగినప్పుడు సింక్‌ మూలల్లో బ్యాక్టీరియా దాగిపోతుంది. దానిని నిర్మూలించాలంటే రోజూ వేడి సబ్బునీటితో క్లీనింగ్‌ చేయాలి. బేకింగ్‌ సోడాను సింక్‌లో వేసి స్క్రబ్‌ చేయొచ్చు కూడా. 

కట్టింగ్‌ బోర్డుల ద్వారా..

కూరగాయలు తరగడానికి కటింగ్‌ బోర్డులను ఉపయోగిస్తాం. బోర్డుపై పడే కత్తి గాట్లలో ఇకోలి, సాల్మొనెల్లా లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా నిలుస్తుంది. దీంతో మళ్లీ బోర్డును ఉపయోగిస్తున్నప్పుడు ఈ బ్యాక్టీరియా కూరగాయ ముక్కల్లో కలిసిపోతుంది. అందుకే కాయగూరలు తరిగిన వెంటనే.. బోర్డును శుభ్రం చేసువాలి.

కటింగ్‌ బోర్డును వేడి నీటితో, డిష్‌ సబ్బుతో కడగాలి.  బోర్డును వెనిగర్‌, నీటితో శుభ్రం చేయాలి. బోర్డు మీద ఉప్పు చల్లి నిమ్మకాయ ముక్కతో రుద్దితే క్రిములు తొలిగిపోతాయి. మాంసం, కాయగూరలకు వేర్వేరుగా బోర్డులను ఉపయోగించండి. ఎక్కువగా గాట్లు పడితే బోర్డును మార్చేయాలి.

టవల్స్‌, స్పాంజ్‌లతో..

వంటగదిలో ఎక్కువగా వినియోగించే వస్తువు స్పాంజి, టవల్‌. పచ్చిగా ఉండే చేతిని తుడుచుకోవడం, గరిటెలు, బౌల్స్‌ ఇతర ఉపకరణాలను తుడవడం, స్టౌ, వంటగది ఉపరితలాలు శుభ్రపరచడం కోసం వినియోగిస్తుంటాం. దీంతో అవి రోజంతా తడిగా ఉంటాయి. దీంతో వాటిపై బ్యాక్టీరియా కొలువుదీరుతుంది. అంతేకాదు.. వీటి ద్వారా క్రిములు ఒకచోటు నుంచి మరోచోటుకు చేరిపోతాయి. తద్వారా ఆహారం కలుషితమవుతుంది.

ప్రతి రాత్రి వేడి నీరు, లాండ్రీ డిటర్జెంట్‌తో స్పాంజ్‌, టవల్‌ను శుభ్రపరచాలి. వారానికోసారి 

వెనిగర్‌లో నానబెట్టి,  తీసి ఎండబెట్టాలి. ప్రతి నెలా టవల్స్‌, స్పాంజీలను మార్చాలి.

వస్తువుల మూలల్లో

ఫ్రిజ్‌ డోర్‌ హ్యాండిల్‌, మైక్రోవేవ్‌, కుక్కర్‌ తదితర ఉపకరణాల హ్యాండిల్స్‌పై కూడా బ్యాక్టీరియా పాగా వేస్తుంది. రోజుకు చాలా సార్లు ఫ్రిజ్‌ను తెరిచి మూసివేస్తారు. అలాగే వంట చేసే క్రమంలో కుక్కర్లు, మైక్రోవేవ్‌ తదితర వాటి హ్యాండిల్స్‌ను పట్టుకుంటారు. ఈ క్రమంలో వాటి మూలల్లోకి బ్యాక్టీరియా చేరిపోతుంది.

ప్లాట్‌ఫామ్‌ మరచిపోవద్దు..

వంటింటి ప్లాట్‌ఫామ్‌పై బ్యాక్టీరియా స్వేచ్ఛగా సంచరిస్తుంటుంది. ఎన్నిసార్లు  తుడిచినా.. వినియోగం ఎక్కువగా ఉండటంతో.. ఎక్కువగా క్రిములు చేరిపోతాయి. కిచెన్‌ కౌంటర్‌, సింక్‌ దగ్గర దుమ్ము పేరుకుపోతుంది. ఈ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. బయోఎంజైమ్‌ ఆధారిత క్లీనర్‌ను ఉపయోగిస్తే.. క్రిములు తోకముడుస్తాయి.


logo