ఊహించని మలుపులు ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. అలాగని బతుకును చీకటిగా మార్చుకోలేదు. సేవాపథంలో సాగుతూ తన జీవితానికి సార్థకత చేకూర్చుకున్నారు. తన మేనత్తలాగా ఎవరూ చివరి రోజుల్లో ఇబ్బందులు పడకూడదని వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. ఎంతో మంది వృద్ధులను చేరదీసి, కూతురిలా సేవ చేశారు, కొడుకై తలకొరివి పెట్టారు. దాదాపు 653 మందికి అంత్యక్రియలు నిర్వహించి.. మనసున్న మనిషి అనిపించుకున్న ‘కిన్నెర వెల్ఫేర్ సొసైటీ’ వ్యవస్థాపకురాలు కిన్నెర నాగ చంద్రికా దేవిని జిందగీ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
మనిషి జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు ఆ మనిషి పట్టుదలకు లొంగుతాయి. కొన్ని ఇబ్బందులు కాలంతో కనుమరుగవుతాయి. నా జీవితం కూడా ఇందుకు అతీతం కాదు. నేను పుట్టింది రాయచోటిలో అయినా.. మా మేనత్త దగ్గర పెరిగాను. ఆమెకు పిల్లలు లేకపోవడంతో నన్ను దత్తత తీసుకున్నారు. పదో తరగతి కాగానే పెండ్లి చేసేశారు. పెండ్లికి ముందే ఆయనకు జబ్బులు ఉన్నాయి. ఆ విషయం దాచి నన్ను పెండ్లి చేసుకున్నారు. రెండేండ్లకే ఆయన కన్నుమూశారు. అప్పటికి ఆయన విద్యుత్ శాఖలో పనిచేసేవారు. అదే ఉద్యోగం నాకు వచ్చింది. జాబ్ అయితే వచ్చింది కానీ, నాకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని కుమిలిపోయేదాన్ని. అక్కడే ఉంటే దిగులుగా ఉంటున్నదని బదిలీపై హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధకు వచ్చాను. ఉద్యోగం చేసుకుంటూనే.. దూర విద్య ద్వారా డిగ్రీ దాకా చదువుకున్నాను. కొన్నేండ్లకు పెద్దల సమక్షంలో మరోవ్యక్తిని వివాహం చేసుకున్నాను. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. గొడవలు మొదలయ్యాయి. అప్పటికే కొడుకు పుట్టాడు. వాడి ప్రాణాలకే గండం ఉందని తెలిసి.. అతని నుంచి విడిపోయాను. బాబును నా వెంటే తెచ్చుకున్నాను.
జీవితం మళ్లీ మొదటికే వచ్చిందనిపించింది. మానసికంగా క్షోభను అనుభవించాను. ఉద్యోగం చేస్తూ.. నా బాధలు మరచిపోయేదాన్ని. ఇలా ఉండగా వృద్ధాప్యంలోకి చేరిన మా మేనత్త నా దగ్గరికి వచ్చింది. ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించి.. రోజూ వెళ్లి బాగోగులు చూసేదాన్ని. అక్కడికి వెళ్లినప్పుడు ఎందరో వృద్ధులు దీనంగా కనిపించేవారు. పట్టించుకునే దిక్కులేక బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. కన్నబిడ్డలు పట్టించుకోని వృద్ధులకు మెరుగైన ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో కిన్నెర వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించాను. అంతకుముందు 2003లో పేద పిల్లల చదువు కోసం కిన్నెర గార్డెన్ స్కూల్ ప్రారంభించాను. తర్వాత రెండు నెలలకే ఈ వెల్ఫేర్ సొసైటీని మొదలుపెట్టాను. ఎవరూ లేని వృద్ధులను చేరదీసి.. వారి ఆఖరి మజిలీ వరకు తోడుండటమే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తున్నది. నా సేవింగ్స్, దాతల సహకారంతో ఉన్నంతలో ఉన్నతంగానే సేవలు అందిస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో మా మేనత్త ద్వారా నాకు సంక్రమించిన ఆస్తిని కూడా అమ్మాల్సి వచ్చింది. ఆస్తులు పోతున్నా నేను బాధపడలేదు. నలుగురికీ సాయం చేస్తున్నానన్న సంతృప్తి ముందు ఏదీ ఎక్కువ కాదనిపించింది. అద్దె భవనాల్లో సాగుతున్న మా ఆశ్రమానికి దాతల సహకారం తోడైంది. ముచ్చింతల్‌లో కొత్తగా కిన్నెర వెల్ఫెర్ సొసైటీ భవనం రూపుదిద్దుకుంటున్నది.
కొందరు వారి తల్లిదండ్రులను తీసుకొచ్చి మా ఆశ్రమంలో చేర్చేవాళ్లు. అప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి.. ఏదైనా అవసరం ఉంటే సంప్రదించమని చెప్పేవారు. తర్వాత వారికి ఫోన్ చేస్తే అస్సలు స్పందించేవారు కాదు. వారికి ఏ కష్టం రాకుండా మేం చూసుకునేవాళ్లం. చివరికి వాళ్లు కాలం చేశారని చెప్పినా.. కడ చూపు చూసేందుకు రావడానికి నిరాకరించేవాళ్లు. తాము పోయినా తమ బిడ్డలు రారని ముందుగానే ఊహించేవారో ఏమో కానీ, ‘మాకు మా సంప్రదాయంలోనే అంత్యక్రియలు నిర్వహించండి’ అని ఎప్పుడూ చెబుతుండేవాళ్లు. అలా వాళ్ల కోరిక మేరకు నేనే వారి అంత్యక్రియలు శాస్త్రీయంగా జరిపించేదాన్ని. ఇలా ఇప్పటి వరకు 653 మందికి నా చేతులతో తలకొరివి పెట్టాను. అందులో మా అమ్మానాన్నలూ ఉన్నారు. ‘నువ్వు ఆడదానివి, చితి పెట్టొద్దు’ అని చాలామంది చెప్పేవారు. ‘ఇన్నాళ్లూ వాళ్ల బాగోగులు చూసుకున్నాను, తిండి పెట్టాను, డైపర్లు మార్చాను.. వారికి అంతిమ సంస్కారం నిర్వహించే బాధ్యత కూడా నాదే’ అని కరాఖండిగా చెప్పేదాన్ని. 2012లో అనుకుంటా! సొసైటీలో ఓ వృద్ధుడు కన్నుమూశారు. అప్పటికే ఐదు రోజులుగా వానలు. అంత్యక్రియలు నిర్వహించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. నా తాళిబొట్టు అమ్మి కర్తవ్యం నిర్వహించాను. ఆశ్రమంలో చనిపోయిన వారి అస్థికలు ఏడాదికి ఒకసారి కాశీకి వెళ్లి గంగలో నిమజ్జనం చేస్తుంటాను. నాకు మూగ జీవాలన్నా ప్రాణమే! రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన వీధి కుక్కలను తీసుకెళ్లి పూడ్చి పెడుతుంటా!
2016లో నాకు ఏపీకి బదిలీ అయింది. ఆశ్రమం నిర్వహణ ఇబ్బంది అవుతుందని ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకున్నా. ఊర్లో ఉన్న పొలాలను అమ్మి మరీ ఈ సంస్థను కొనసాగించాను. నేను చేస్తున్న ఈ సేవను చూసి మొదట్లో మా అమ్మానాన్నలు తట్టుకోలేకపోయారు. ముక్కూముఖం తెలియని వాళ్ల మలమూత్రాలు ఎత్తిపోయడం ఏంటని నిలదీశారు. ఈ సేవలు వద్దు, త్యాగాలు వద్దని నిలువరించే ప్రయత్నం చేశారు. నేను వాళ్ల మాటలు లక్ష్యపెట్టలేదు. అమ్మానాన్న వృద్ధాప్యంలో నా దగ్గరికే చేరారు. అక్కడ పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాక గానీ, వాళ్లకు నేను చేస్తున్న పని ఎంత గొప్పదో అర్థం కాలేదు. నేటి విద్యావిధానంలో మార్పులు వస్తేనే.. పెద్దలంటే పిల్లలకు గౌరవం, భక్తి ఏర్పడతాయి. అప్పుడే వృద్ధాశ్రమాలు తగ్గుతాయి. అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నా. మా సంస్థ ఆశయం కూడా అదే.
వయోవృద్ధులకు నేను చేస్తున్న సేవలు గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో సేవా ధర్మా, బెస్ట్ విమెన్ అవార్డు లాంటి పురస్కారాలు ప్రదానం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర సీనియర్ సిటిజన్ కౌన్సిల్ సభ్యురాలిగా నియమించింది. ఇందులో భాగంగానే వయోవృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు నాగర్‌కర్నూల్‌కు వెళ్లాను. అక్కడ కొందరు జర్నలిస్టులు జప్తీ సదగోడు గ్రామ స్థితిగతులను నాకు వివరించారు. మర్నాడు ఆ గ్రామానికి వెళ్లి.. అక్కడి వారితో మాట్లాడాను. ఆ ప్రాంతంలో నీటి సౌకర్యం లేదు. ప్రజలందరూ ఏదో సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నా. దాతల సహకారంతో గ్రామంలోని బడిని బాగు చేయించాను. అర్హులైన వారికి ప్రభుత్వ పింఛన్ అందేలా చూశాను. తాగు నీటి సౌకర్యం కూడా కల్పించాను. మొత్తానికి జప్తీ సదగోడుకు ఒక రూపాన్ని ఇచ్చాను.