జీ5 : స్ట్రీమింగ్ అవుతోంది.
తారాగణం : జీవీ ప్రకాష్, దివ్య భారతి, చేతన్,
అళగం పెరుమాళ్ తదితరులు, దర్శకత్వం : కమల్ ప్రకాష్
సముద్రంలో హీరో సాహసయాత్ర.. చెప్పలేని థ్రిల్‌ని పంచుతుంది. అతని సాహసానికి హారర్, థ్రిల్లింగ్ కూడా తోడైతే.. ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడుతుంది. తెరపై అరుదుగా కనిపించే ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే.. కింగ్స్టన్. తాజాగా జీ5 వేదికగా స్ట్రీమింగ్కు వచ్చి.. హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. 1982లో తమిళనాడు సముద్ర తీరప్రాంతంలో ఉండే ‘తూవత్తూర్’ అనే గ్రామంలో జరిగే కథ ఇది. పల్లెలోని జాలర్లందరికీ సముద్రంలోని చేపలు పట్టడమే జీవనాధారం. కొన్ని కారణాల వల్ల గ్రామానికి చెందిన బోసయ్యను గ్రామస్థులంతా కొట్టి చంపుతారు. అతని శవాన్ని పేటికలో పెట్టి.. సముద్రంలో జలసమాధి చేస్తారు.
అప్పటి నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు.. శవాలుగా తీరానికి కొట్టుకొస్తుంటారు. ‘బోసయ్య ప్రేతాత్మే’ అందుకు కారణమని అందరూ భయపడుతారు. మూఢ నమ్మకాలతో సముద్రానికి ఆడపిల్లలను ‘బలి’ ఇస్తుంటారు. దాంతో ప్రభుత్వం అక్కడ చేపల వేటను నిషేధిస్తుంది. ఫలితంగా.. ఊరి ప్రజలంతా ఉపాధిని కోల్పోతారు. ఇదే అదునుగా థామస్ (సబుమాన్ అబ్దుసమద్) ముఠా.. ఉపాధి పేరుతో తూవత్తూర్ యువకుల్ని అసాంఘిక కార్యకలాపాల్లోకి లాగుతుంది. కింగ్స్టన్ అలియాస్ కింగ్ (జీవీ ప్రకాశ్)తోపాటు ఇంకొందరు యువకులు ఆ ముఠాలో చేరుతారు. ఈ క్రమంలో సముద్రంపై కింగ్స్టన్కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? థామస్ అక్రమ వ్యవహారాలు ఎలా బయటపడతాయి? కింగ్స్టన్ గతం ఏంటి? అనే అంశాలు థ్రిల్‌ను పంచుతాయి.