అతివల అలంకరణలో ఆభరణాలు ఎంత ముఖ్యమో, వాటి తయారీలో వజ్రాలదీ అంతే కీలకమైన పాత్ర. పసిడి వన్నెలకు వజ్రపు మెరుపులు తోడైతే ఇక చెప్పేదేం ఉంటుంది. అందుకేనేమో, ఎన్ని నగలు ఉన్నా.. ఒక్కటైనా వజ్రాభరణం లేకపోతే మగువ మనసు చిన్నబోతుంది. ముక్కెర నుంచి పట్టీల వరకు ఏదో ఒక నగలో డైమండ్ రాజ్యమేలితేనే ఆమెకు సంతృప్తి. కానీ, ఖరీదైన వజ్రాలు ఎంతమంది కొనగలరు. అలాగని ఇమిటేషన్‌లో లభించేవి సిసలైన డైమండ్ల మెరుపుతో సరితూగవు.
ఈ సమస్యలకు చెక్ పెడుతూ రూపొందినవే కృత్రిమ వజ్రాలు. ప్రయోగశాలల్లో పురుడు పోసుకుంటున్న కృత్రిమ వజ్రాలు ఇప్పుడు సరసమైన ధరల్లో అందుబాటులోకి వచ్చేశాయి. ఇంకేముంది అతివలకు
వజ్రోత్సవమే కదా! కృత్రిమ వజ్రాలు సహజంగా దొరికే వాటికన్నా 30-50% తక్కువ ధరలో లభిస్తాయి. వీటిలోనూ రంగు, ఆకారం, పరిమాణాన్నిబట్టి ధరలు ఉంటాయి. నాణ్యతకు అనుగుణంగా సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. వీటి మెరుపు, కట్, క్యారెట్, కలర్ ఆధారంగా భిన్నమైన ధరల్లో లభిస్తున్నాయి. అభిరుచికి తగినట్లు నచ్చిన విధంగా ఈ వజ్రాలతో కస్టమైజ్డ్ ఆభరణాలను చేయించుకునే వీలుంది.
ఆధునిక ట్రెండ్స్‌కి తగినట్టు మినిమలిస్ట్ డిజైన్స్‌తో సింగిల్ స్టోన్ డైమండ్ రింగ్స్, డెలికేట్ పెండెంట్స్, స్టడ్ ఇయర్ రింగ్స్ వెస్ట్రన్వేర్పై చక్కగా నప్పుతాయి. పెద్దపెద్ద రంగురంగుల వజ్రాలు పొదిగిన చోకర్లు, హారాలు, గాజులు, వడ్డాణాలు సంప్రదాయ దుస్తులకు మరింత అందాన్ని జోడిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ఈ కృత్రిమ వజ్రాలను ధరించి అందంగా మెరిసిపోండి!