రంగుల ప్రపంచంలో అందానిదే అగ్రస్థానం. దేవ కన్యలా కనిపించే సౌందర్యవతులకే ఇక్కడ అగ్రతాంబూలం. అందుకే, చాలామంది సినీతారలు అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ఆసక్తి చూపుతారు. రకరకాల కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ కాస్మెటిక్ సర్జరీల వ్యవహారం విస్తృతమైన గాసిప్‌లకు ఆజ్యం పోస్తుంది. ఆన్లైన్ ట్రోలింగ్‌లకు దారితీస్తుంది. ఇటువంటి చర్చలు బాలీవుడ్లో కొత్తేమీ కాకున్నా.. తాజాగా, నటి జాన్వీ కపూర్ ఈ విషయంపై స్పందించింది.
ఓ చాట్ షోలో సీనియర్ నటి కాజోల్‌తో కలిసి మాట్లాడుతూ.. కాస్మెటిక్ సర్జరీల గురించి చెప్పుకొచ్చింది. తాను కూడా ముఖానికి చిన్నచిన్న సర్జరీలు చేయించుకున్నట్లు అంగీకరించింది. అయితే, అది ఇప్పుడు కాదనీ.. ఆ నిర్ణయాలు, ఆచరణ మొత్తం తన తల్లి శ్రీదేవి మార్గదర్శకత్వంలో తీసుకున్నవేననీ చెప్పింది. ఇంకా మాట్లాడుతూ.. “ఇటీవల నేనొక వీడియో చూశాను. అందులో కొందరు స్వయం ప్రకటిత వైద్యులు ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మొటిక్ ట్రీట్మెంట్ల గురించి చెబుతున్నారు. వారిలో ఒకరు నా ఫొటోను చూపిస్తూ.. నేనేదో బఫెలో ప్లాస్టీ, ఇంకేదో చేయించుకున్నట్లు చెప్పారు. కానీ, అవేమీ నాకు తెలియదు.
ముఖానికి చిన్నచిన్న మార్పులు మాత్రం చేయించుకున్నాను. అదికూడా మా అమ్మ నేతృత్వంలోనే” అంటూ చెప్పుకొచ్చింది. “అయితే, ఈ విషయాన్ని ఒక రకమైన హెచ్చరికగా పంచుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా ఇలాంటి వీడియోలు చూసి నమ్మితే!? అదే నిజమనుకొని అలాంటిదేదైనా ప్రయత్నించి ఏదైనా తప్పు జరిగితే!? అందుకే.. దేన్నయినా విశ్వసించేముందు, నిజానిజాలపై ఆరా తీయాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి” అంటూ సలహా ఇచ్చింది. ఇదే షోలో పాల్గొన్న సీనియర్ నటి కాజోల్ కూడా స్పందిస్తూ.. కొందరు తనతోపాటు తన కూతురు నైసాపైన కూడా బురద జల్లే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చింది.
“వీళ్లలో కొందరు నన్ను కూడా ఇబ్బంది పెట్టారు. ‘మీరు ఈ శస్త్రచికిత్సలన్నీ చేయించుకున్నారు కదా!?’ అని అడిగేవాళ్లు. నేను, నైసా దాదాపు 25 రకాల సర్జరీలు చేయించుకున్నామని అనేవాళ్లు. అవన్నీ వింటుంటే నాకు బాధతోపాటు నవ్వుకూడా వచ్చేది” అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. “పరిశ్రమలోకి అడుగుపెట్టే యువ నటీమణులకు నేను ఒక్కటే చెబుతున్నా. దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక పద్ధతిలో సృష్టించాడు. ఏవైనా లోటుపాట్లు అనిపిస్తే.. వాటిని సరిచేయడానికి ‘మేకప్’ అనే సౌలభ్యం ఉంటుంది. దాన్ని సమర్థంగా వినియోగించుకుంటే చాలు. ఎవరో చెప్పారని శస్త్ర చికిత్సలు చేయించుకుంటే లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ చివరిసారిగా పరమ్ సుందరీ, సన్నీ సంస్కారికి తులసి కుమారి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి ‘పెద్ది’ కోసం సిద్ధమవుతోంది.