‘విషయం వస్తువులో కాదే.. నీ చేతిలో ఉంది’ ఈ మాట ‘మిథునం’లో అప్పదాసు పలుకుతాడు. కోరి కోరి వండిన పదార్థాన్ని కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆ తృప్తే వేరు! కానీ, ఫుడ్ ట్రక్స్ బారులు తీరిన చోట, వేలు తచ్చాడిస్తే చాలు డెలివరీ బాయ్ ఫుడ్ తెచ్చేస్తున్న ఈ రోజుల్లో.. సిసలైన రుచి చిరునామా కోల్పోయిందనే చెప్పాలి. పదార్థంలో కారంతోపాటు రంగరించిన మమకారాన్ని మిస్ అవుతున్నామేమో అనిపిస్తున్నది. పట్నవాసుల్లోనే కాదు… పల్లె ప్రజల ఆహార వ్యవహారాల్లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యత్యాసాలు.. మీ జిహ్వ ఉత్సాహాన్ని క్రమంగా నీరుగారుస్తాయి. ఈ ప్రభావం మీ జీవితంపైనా పడుతుంది.
గడియారపు ముల్లులా జీవితం పరుగులు పెడుతున్నది. ఆఫీసు, ప్రాజెక్టులు, వర్చువల్ లైఫ్!! తీరిక ఎక్కడిది? పని ఒత్తిళ్లలో మునిగి తేలుతున్నాం. ఈ క్రమంలో వంటింటి వైపు చూసే తీరికెక్కడ? వీధి చివర్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, వేళ కాని వేళ ఫుడ్ ట్రక్కులు, వేళ మించిపోతున్న సమయాన స్విగ్గీ ఆర్డర్లు… ఇలా నెట్టుకొస్తున్న వాళ్లు ఎందరో! నిజానికి, ఈ బిజీలైఫ్‌లో చిక్కుకున్న నేటితరం ఆహారం అంటే కేవలం ఆకలి మండిపోతున్నప్పుడు దాన్ని చల్లార్చే పదార్థంగా మాత్రమే భావిస్తున్నది. కానీ, ఆహారం ఓ తీయని జ్ఞాపకం. అలసిన మనసుకు ఔషధం. ఇంకా చెప్పాలంటే.. ప్రతీ రుచి.. ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మీ మస్తిష్కంలో ముచ్చటైన మెమొరీని దాస్తుందని నిపుణుల మాట!
మనం తినే ఆహారం.. వాటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు మనల్ని టైమ్ ట్రావెల్ చేయిస్తాయి. బాల్యాన్ని గుర్తు చేస్తాయి. మనసుకు ఓదార్పునిస్తాయి. ముఖ్యంగా ఫుడ్ మెమొరీలు డిమెన్షియా (మతిమరుపు)ను దూరం చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. పాశ్చాత్యుల సంగతేమో కానీ, మన భారతీయ సంస్కృతిలో ఆహారం కుటుంబ బంధాలకు పునాది, ఆచారాలకు వారధి. మసాలా దినుసుల సువాసనలు, రోట్లో పచ్చడి నలుగుతున్న శబ్దం, కుక్కర్ విజిల్, పోపు చిటపటలు.. ఇవన్నీ మన జ్ఞాపకాలను తట్టిలేపేవే!
జీవితంలో ఆహారం, జ్ఞాపకాల మధ్య విడదీయరాని సంబంధం ఉంది. చిన్నప్పుడు అమ్మమ్మ చేతి గోరుముద్దలు, పండగలకు ఇంట్లో చేసిన ప్రత్యేక వంటకాలు… ఆ రుచి, సువాసన, జ్ఞాపకాలు మన మనసులో బలంగా నాటుకుపోతాయి. పెద్దయ్యాక మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు వాటిని గుర్తు చేసుకుని ఊరుకుంటే ప్రయోజనం లేదు. అలాంటి పదార్థాలు స్వయంగా చేసుకునే ప్రయత్నం చేస్తే.. మనసుకు గొప్ప ఊరట లభిస్తుంది. ఒక్కసారి వంటగదిలోకి వెళ్లండి.. తాజా కాయగూరల వంక చూడండి, అవి తమ వల్ల కలిగే ప్రయోజనాలు ఏకరవు పెట్టేస్తుంటాయి. అలా చూసి వచ్చేయకండి. స్త్రీమూర్తులైతే.. మీ అమ్మగారిని గుర్తు చేసుకుంటే సరి.. అన్నపూర్ణగా మారిపోతారు. పురుషులైతే.. నలభీములను తలుచుకోండి, నడుం బిగించేస్తారు. పాకయాగం చేస్తున్నంత సేపు ఒత్తిడి మీ దరికి రాదు. స్వీయపాకం వల్ల కలిగే ప్రయోజనాలు
మానసిక ప్రశాంతత: మనకు ఇష్టమైన ఫుడ్, నచ్చినట్లు చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఆ కాసేపు వంటిల్లు మనకు సేఫ్టీజోన్లా మారిపోతుందన్నమాట. ఇంద్రియాలకు రిలాక్స్: వంట వండటం అంటే.. కాన్షియస్గా మల్టీటాస్కింగ్ చేయడమే! ఒకటి చేస్తూనే మరోకటి ప్లాన్ చేసుకుంటూ ఉండాలి! చపాతీలు గుండ్రంగా లాటించడం, కూరగాయలు ఒక్కతీరుగా తరగడం, అన్నం సరిగ్గా ఉడికిందో లేదో చూడటం, ఉప్పుకారాలు సరైన మోతాదులో వేయడం.. ఇవన్నీ చేసేటప్పుడు ఇంద్రియాలు ఫోకస్‌గా పనిచేస్తాయి. వంట చేస్తున్నంత సేపూ మనసు ఒకే చోట లగ్నమవుతుంది. ఒకరకంగా ఇది మెడిటేషన్లా
సేవ చేయడమే: నలుగురికి వండటం అంటే.. సేవ చేయడమే. రుచికరమైన భోజనంతో మరొకరి కడుపు నింపడం కంటే పుణ్యకార్యం ఇంకేం ఉంటుంది. వంట పూర్తవగానే ‘నేను ఒక మంచి పని చేశాను’ అనే భావన కలుగుతుంది. ఇది చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
బంధాల బలోపేతం: ఆహారం ఎప్పుడూ సామాజిక అంశాలతో ముడిపడి ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి వంట చేయడం, కలిసి తినడం బంధాలను బలపరుస్తుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. పనిలో పనిగా అమ్మతో, అమ్మమ్మతో వాళ్లు చేసే ప్రత్యేక వంటకాల గురించి తెలుసుకొని.. ప్రయత్నిస్తే, వారసత్వాన్ని కొనసాగించవచ్చు కూడా! ఎందుకు ఆలస్యం.. గరిటె పట్టండి గిరగిరా తిప్పండి. ప్రయోగాలు మొదలుపెట్టండి. రుచికరమైన పదార్థాలను నలుగురికీ పంచి మీరూ ఆస్వాదించండి. రెగ్యులర్‌గా కాకపోయినా, వారాంతాల్లో అయినా.. షెఫ్ అవతారం ఎత్తండి. ఆనందకరమైన సమయాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిద్ధం చేసేయండి.