హిమాలయాల్లో జల ప్రళయం చూశాం. దేశంలో ఎల్‌నినో ప్రభావం చూస్తున్నాం. అంతకుముందు నుంచే ఇలాంటి రాబోయే ముప్పుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయినా ప్రకృతి పరంగా చేయాల్సిన క్రతువుల విషయంలో సరైన ఆచరణ లేక జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పర్యావరణ సంక్షోభాన్ని నివారించేందుకు, దాని పరిరక్షణ కోసం ఈశాన్ అనే కుర్రాడు లండన్‌లో ‘ఎకోఎడస్’ అనే సంస్థను స్థాపించాడు. సిటీ ఆఫ్ లండన్ స్కూల్లో చదువుతున్న ఈశాన్ విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తున్నాడు. పర్యావరణాన్ని కాపాడుకోవడం గురించి పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాడు.
వివిధ వేదికలపై ప్రసంగిస్తున్నాడు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన ‘దావోస్ ఇన్నోవేషన్ వీక్’లో వాతావరణం గురించి యువత వైఖరిని తెలియజేస్తూ ప్రసంగించాడు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు విద్యార్థుల కృషి ఎలా ఉండాలో ఆ సదస్సులో మాట్లాడాడు. పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో అమలు చేసిన హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్‌ల స్ఫూర్తితో మూడేండ్ల క్రితం ఎకోఎడస్ సంస్థను స్థాపించాడు. అప్పటికి అతని వయసు పన్నెండేండ్లు. విద్యార్థులు పర్యావరణం గురించి అవగాహన పెంచుకునేందుకు సెల్ఫ్ లెర్నింగ్ కిట్స్ రూపొందించాడు. వాటి సహాయంతో లండన్‌లో ఎంతోమంది పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంపొందించేందుకు కృషి చేశాడు. ప్రస్తుతం తను పదో తరగతి చదువుతున్నాడు.
ఈశాన్ తల్లిదండ్రులు కామారెడ్డికి చెందినవారు. ప్రస్తుతం సెలవుల్లో స్వస్థలానికి వచ్చిన ఈశాన్ పది రోజుల నుంచి స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో పర్యావరణ సంక్షోభం గురించి ప్రసంగిస్తున్నాడు. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం, ఇంధన పొదుపు, పునరుత్పాదక ఇంధన వినియోగం, కాలుష్య నియంత్రణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. దండుమల్కాపురంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ సభ్యులతోనూ పర్యావరణ పరిరక్షణ గురించి చర్చించేందుకు సమావేశమయ్యాడు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేసిన హరితహారం, మొక్కలు నాటేందుకు ఎందరినో ప్రేరేపించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్ఫూర్తితోనే ఎకోఎడస్ సంస్థను స్థాపించానని ఈశాన్ అంటున్నాడు. తను పుట్టిన ఈ నేల ఇచ్చిన ప్రేరణతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇక్కడే అమలు చేయడం ఆనందంగా ఉందని చెబుతున్నాడు. స్థానిక విద్యాసంస్థల్లోని విద్యార్థులతో కలిసి పర్యావరణం కోసం ఒక స్టూడెంట్ నెట్వర్క్ నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. మరి ఈ అబ్బాయికి మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం!