డాక్టర్‌గారు నమస్తే. నా వయసు నలభై సంవత్సరాలు. ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నాను. ఏడాదిన్నర క్రితం నాకు కొవిడ్ వచ్చింది. కొద్ది నెలల్లో కోలుకున్నాను. అయితే ఆ తర్వాత.. నెలసరికి వారం రోజుల ముందు నుంచీ విపరీతమైన నీరసం వస్తున్నది. ఇంటి పనులు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటున్నది. కొవిడ్‌కు, ఈ నిస్సత్తువకు ఏమైనా సంబంధం ఉందా? లేదంటే, నా వయసు రీత్యా పీరియడ్స్ సమయంలో ఇబ్బంది అవుతున్నదా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ వయసు నలభై సంవత్సరాలని అన్నారు. ఈ సమయంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. అశ్రద్ధ చేయకుండా సమతులాహారం తీసుకోవడం ముఖ్యం. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. బలవర్ధకమైన ఆహారంతో పాటు చిన్నపాటి వ్యాయామాలు శరీరానికి కొత్త శక్తినిస్తాయి. మీ
నీరసానికి, కొవిడ్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పలేం. విటమిన్-డి లోపం కూడా బలహీనతకు కారణం కావచ్చు. ముందు వైద్య పరీక్షలు చేయించుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే నిపుణుల సలహాతో మందులు వాడండి. దీంతోపాటు రక్త పరీక్ష కూడా అవసరం. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోయినా నీరసం ఆవహిస్తుంది. రక్తం సమృద్ధిగా ఉండేందుకు పాలకూర, దానిమ్మ, మునగాకు, అంజీర లాంటివి ఆహారంలో భాగం చేసుకోండి.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్