బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్. సహజమైన నటన, వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి నటుడితో కలిసి పనిచేయడం మాత్రం అంత సులభం కాదట. ఈ విషయాన్ని బాలీవుడ్ దర్శకురాలు తనూజా చంద్ర ఇటీవల గుర్తుచేసుకున్నది. ఓ ఆన్లైన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇర్ఫాన్‌తో కలిసి పనిచేసిన రోజులు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నది.
‘తనకాలంలో అత్యంత ప్రశంసలు పొందిన నటులలో ఇర్ఫాన్ ఒకరు. పని విషయంలో చాలా ప్రత్యేకంగా ఉండేవాడు. అతనితో కలిసి పనిచేసిన రోజులు చాలా అందంగా, ఆనందంగా గడిచేవి. అదే సమయంలో చాలా కష్టంగా కూడా ఉండేది’ అంటూ చెప్పుకొచ్చింది. నటనలో సహజత్వం పోతుందని ఇర్ఫాన్ ఎక్కువ టేకులు తీసుకోవడానికి ఇష్టపడేవాడు కాదట. బిగ్గరగా మాట్లాడమని అడిగినా.. అంగీకరించేవాడు కాదట. ‘ఇర్ఫాన్ ఎప్పుడూ గొణిగినట్లుగా మాట్లాడేవాడు.
ఆ మాటలు ఎవరికీ అర్థం కాకపోయేవి. డబ్బింగ్ సమయంలోనూ అదే పరిస్థితి ఉండేది’ అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నది. ‘సలామ్ బాంబే’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఇర్ఫాన్.. తొలి సినిమాతోనే తనలోని వైవిధ్యమైన నటుడిని బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి.. అక్కడా మంచి పేరు సంపాదించాడు. క్యాన్సర్‌తో 2020లో మరణించాడు.