కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడు దేవదాసు. ఎంత తాగి వాగినా… అతగాడు సత్యమే చెప్పాడు. కానీ, ఈ లోకం మాత్రం.. ఎడమ చేతిని ఎందుకో చిన్నచూపు చూస్తుంటుంది. వామహస్తం కాస్త చొరవగా స్పందిస్తే.. పక్కన వ్యక్తి దక్షిణ హస్తం దాన్ని వెనక్కు లాగుతుంది. చేయరాని పనేదో చేసినట్టుగా అందరి కళ్లూ విస్తుపోయి చూస్తుంటాయి. ఈ ప్రపంచంలో లెఫ్ట్‌హ్యాండర్స్ తక్కువే కావొచ్చు.. కానీ, పోటాపోటీ లోకంలో ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అంటున్నారు. ‘అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే’ సందర్భంగా ఈ ‘వామ’నమూర్తుల గురించి కొంత..
ప్రపంచ జవాభాలో ఎడమ చేతి వాటం ఉన్నవాళ్ల వాటా పదిశాతం మాత్రమే. ఇంట్లో అమ్మావాళ్లు అడ్డు చెప్పినా, బడిలో టీచర్లు బెత్తానికి పని చెప్పినా.. లెఫ్ట్ హ్యాండర్స్ అంత త్వరగా హ్యాండ్సప్ చేసేయరు. ఎందరు గేళి చేసినా, మరెందరు అపశకునంగా భావించినా.. లెఫ్ట్ హ్యాండర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారని సర్వేలు చెబుతున్న సంగతి. వైజ్ఞానిక రంగం, క్రీడలు, కళలు, నాయకత్వం ఇలా ఏ రంగాన్ని పరికించినా.. ఉన్నత శిఖరాలు అధిరోహించిన లబ్ధ ప్రతిష్ఠుల్లో ఎడమచేతి వాటం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తారు. అయితే, ఈ ప్రపంచం లెఫ్ట్హ్యాండర్స్ను చిన్నచూపు చూస్తున్నదని బ్రిటన్‌కు చెందిన డీన్ ఆర్ క్యాంప్‌బెల్ అనే వ్యక్తి 1976లో మొదటిసారిగా ‘ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే’ని నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న వివిధ ప్రాంతాలకు చెందిన లెఫ్ట్ హ్యాండర్స్ తమ అనుభవాలను పంచుకున్నారు. తాము ఒంటరివాళ్లం కాదని, తమకున్నది లోపం కాదనే భావన కలిగించారు. ఈ కార్యక్రమంలోనే వారికి అనుకూలమైన పరికరాలను అందించారు. నాటి నుంచి ఏటా ఆగస్టు 13న ‘వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే’ని నిర్వహిస్తున్నారు.
చూసేందుకు అందరిలాగే కనిపించినా లెఫ్ట్ హ్యాండర్స్ ఆలోచనా సరళి కాస్త భిన్నంగా ఉంటుందట. సృజనాత్మకంగా ఆలోచిస్తారట. అదే సమయంలో చురుకుదనం పాళ్లలో వీరి మెదడు పాదరాసమని అధ్యయనాల్లో తేలింది. అందుకు కారణం ఎడమచేతివాటం కలిగిన వ్యక్తులు మెదడులోని ఎడమ భాగం కంటే కుడి భాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇదే వారు తమదైన రంగాల్లో ముందుండేలా చేస్తుంది. మల్టీటాస్కింగ్ సామర్థ్యం కలిగిన వీళ్లు రెండు పనులను ఒకేసారి చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. పాఠశాలలు, కార్యాలయాల్లో ఉపయోగించే పరికరాలు ఎక్కువ శాతం కుడిచేతి వాటం వారికి అనుకూలంగా ఉంటాయి. అయినా లెఫ్ట్ హ్యాండర్స్ వాటిపై పట్టు సాధిస్తున్నారు. ఇంట్లో వాడే కత్తెరలు, సంగీత సాధనాలు, కంప్యూటర్ మౌస్ లాంటి వస్తువుల నిర్మాణమూ ఎడమచేతి వాటం వారికి అసౌకర్యంగా ఉంటుంది. ఇలా అడుగడుగున ప్రతికూలతలు ఎదురైనా.. లెఫ్ట్ హ్యాండర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్‌తో ఆయా రంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటున్నారు. మొత్తంగా కుడి ఎడమైతే మేలేనోయ్ అని చాటుతున్నారు.
మనం అభిమానించే పొలిటికల్ లెజెండ్స్, క్రీడాకారులు, సినిమా యాక్టర్స్‌లో లెఫ్ట్ హ్యండర్స్ ఎందరో ఉన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ లెఫ్ట్ హ్యాండర్. అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్లు సైతం ఎడమ చేతి వాటం గలవారే! క్రికెట్ దేవుడు సచిన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ అయినా.. రాతపోతలన్నిటికీ ఎడమ చేతినే వాటంగా ఉపయోగిస్తుంటాడు. సౌరభ్ గంగూలీ, బ్రయాన్ లారా, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నడాల్, బిగ్ బి అమితాబ్, చార్లీ చాప్లిన్ ఇలా ఎందరెందరో లెఫ్ట్ హ్యాండర్సే!! మహానటి సావిత్రి కూడా ఎడమచేతి వాటాదారే! ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, మేరీ క్యూరీ ఇలా ఎందరో ప్రముఖులు లెఫ్ట్ హ్యాండర్స్ జాబితాలో ఉన్నవాళ్లే!
– రాజు పిల్లనగోయిన