కాలంతోపాటు మనుషుల జీవనశైలి కూడా మారుతున్నది. ముఖ్యంగా, రాత్రిపూట విధులతో కంటినిండా నిద్ర కరువై పోతున్నది. ఇక రాత్రంతా టీవీలు, స్మార్ట్ఫోన్లు చూస్తూ గడపడం వల్ల.. ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించాల్సి వస్తున్నది. ఈ క్రమంలో నిద్రలేమి సమస్య మొదలై.. అనేక అనర్థాలకు దారితీస్తున్నది. దీన్నుంచి బయట పడాలంటే.. కొన్ని సలహాలు-సూచనలు పాటించాలి. నిద్రలేమి వల్ల మెదడుకు తగిన విశ్రాంతి లభించదు.
దాంతో మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. కోపం, చిరాకు, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలూ చుట్టుముడతాయి. ఇక నిద్రలేమితో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతుందని అనేక సర్వేలు వెల్లడించాయి. దాంతో ఏ పనిపైనా దృష్టి నిలవదు. పని సామర్థ్యం కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. కంటినిండా నిద్ర కరువైతే.. కడుపు నిండా భోజనం అవసరం అవుతుందట.
ఎందుకంటే.. నిద్రలేమితో ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ లాంటి హార్మోన్లలో అంతరాయం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఎక్కువగా తింటారనీ, ఫలితంగా బరువు పెరుగుతారని అంటున్నారు. జీర్ణవ్యవస్థలో కీలకమైన గట్ బ్యాక్టీరియాపైనా.. నిద్రలేమి ప్రభావం చూపుతుందట. కాబట్టి, శారీరక-మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలపాటు నాణ్యమైన నిద్ర ఉండాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ రాత్రి 10 గంటలలోపే నిద్రకు ఉపక్రమించడం మంచిదని సలహా ఇస్తున్నారు.