కొత్త క్యాలెండర్ గోడెక్కగానే.. పాత క్యాలెండర్ కనుమరుగవుతుంది. కానీ, ఆ కాలమానిని.. తలమానికమైన ఎన్నో ఘనతలకు ఆలవాలమైతే, దానిని అలా వదిలేసుకుంటే ఎలా? ఆ గడిచిన కాలంలో ఎగిసిన విజయాలను అవలోకనం చేసుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది. అతివ నామ సంవత్సరంగా
జయకేతనం ఎగురవేసిన గతేడాదిని స్ఫూర్తిగా తీసుకుందాం. మహిళా లోకం అందుకున్న అపూర్వమైన మజిలీలను స్మరించుకుంటూ 2025కు స్వాగతం పలుకుదాం.
ఒలింపిక్స్‌లో ఒక పతకం సాధించడమే గొప్ప అనుకుంటే జోడు పతకాల్ని తన ఖాతాలో వేసుకుందామె. అంతేకాదు, రైఫిల్ చేతపట్టి పతకాన్ని కొల్లగొట్టిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. గతేడాది క్రీడారంగంలో మారుమోగిన పేరు మనూ భాకర్. ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కాంస్య పతకాలు గెలిచిందామె. హరియాణాకు చెందిన మనూకు చిన్నప్పటి నుంచీ క్రీడలంటే ఎంతో ఇష్టం. తొలుత తంగ్ టా అనే యుద్ధ క్రీడ నేర్చుకుని జాతీయ స్థాయిలో రాణించింది. ఆ తర్వాత ఆమె మనసు షూటింగ్ వైపు మళ్లింది. తన కోచ్ జస్పాల్ రాణా ఆసియా క్రీడల్లో 4 స్వర్ణాలు, వరల్డ్ చాంపియన్‌షిప్ జూనియర్లో మరో బంగారు పతకం గెలిచిన అనుభవశాలి. ఆయన సారథ్యంలో మనూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నది. 14 ఏండ్ల వయసుకే రియో ఒలింపిక్స్‌లో కాలు పెట్టింది. ఆసియా క్రీడల్లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ బంగారు, వెండి పతకాలు కైవసం చేసుకుంది.
ఆర్మీలో విధులు నిర్వర్తించడమే కష్టమంటే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రంలో ఆ పనిచేయడం మరెంత సాహసం! అలాంటి ప్రమాదకరమైన చోట ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం నుంచి విధులు నిర్వర్తించేందుకు చేరారు కెప్టెన్ సుప్రీత సీటీ. సియాచిన్ దగ్గర దేశ రక్షణ చేసేందుకు ఈ విభాగం నుంచి ఎంపికైన తొట్టతొలి మహిళ ఆమె. వేల అడుగుల ఎత్తున ఏడాది పొడవునా మంచు దుప్పటిలో మునిగి ఉండే ప్రదేశమది. -20 నుంచి -30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే ఈ చోట, చలికాలంలో అయితే ఏకంగా -50 డిగ్రీలు నమోదవుతుంది. ఇక్కడ పనిచేయాలంటే శారీరక, మానసిక దృఢత్వం ఎంతో అవసరం. కర్ణాటకలోని మైసూరుకు చెందిన సుప్రీత చిన్ననాటి నుంచే ఎన్సీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందింది. మూడేండ్ల క్రితం ఆర్మీలో చేరింది. తొలినుంచీ సవాళ్లతో కూడిన విధులు కోరుకునేది. వివిధ పోస్టింగుల్లో తన సత్తా చాటుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రంలో పనిచేసేందుకు ఎంపికై
అరుదైన ఘనత దక్కించుకుంది.
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో చరిత్రలో తొట్టతొలిసారి ఆల్ ఉమెన్ సీఐఎస్ఎఫ్ రిజర్వ్ బెటాలియన్‌ను ఈ ఏడాది ఏర్పాటుచేశారు. దేశానికి సంబంధించిన ఆస్తుల పరిరక్షణతో పాటు ఎన్నికల నిర్వహణ, ప్రముఖుల రక్షణ తదితర డ్యూటీలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నిర్వహిస్తుంది. ఈ విభాగం ద్వారా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 1025 మంది మహిళలు ఈ ప్రత్యేక ‘మహిళా బెటాలియన్’లో చేరారు. ఎర్రకోట, తాజ్‌మహల్‌లాంటి ప్రఖ్యాత కట్టడాల రక్షణలో ఇలాంటి బెటాలియన్లు భాగమవుతాయి. 68 విమానాశ్రయాలతోపాటు, మెట్రోలు, రైల్వేస్టేషన్లు, వీఐపీల భద్రతలోనూ వీళ్లుంటారు. దీనిద్వారా, రక్షణ విధుల్లో మహిళల స్థానాన్ని బలోపేతం చేసే దిశగా తొలి అడుగుపడినట్టయ్యింది.
వ్యోమగామి.. ఓ సాహస జీవి. భూ మండలాన్ని దాటి అంతరిక్షంలోకి అడుగిడటమే ఓ అద్భుతం. అలాంటి అద్భుతాన్ని ఒక్కసారి కాదు రెండుసార్లు అనుభవించారు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్. నిజానికి అంతరిక్ష యాత్రలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయో, అంతే సంక్లిష్టంగానూ ఉంటాయి. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. అనుకున్నదానికన్నా తక్కువ రోజుల్లోనే వెనక్కి తిరిగి వచ్చేయాల్సి రావచ్చు, లేదా రోజులు అనుకున్న చోట నెలలు ఉండాల్సిన అవసరమూ ఏర్పడొచ్చు. సునీత విషయంలో అదే జరిగింది. గతేడాది జూన్ 5న మరో యాత్రికుడితో కలిసి ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లారు సునీత. కానీ అక్కడ ఏర్పడ్డ సాంకేతిక సమస్యల వల్ల ఆరు నెలలుగా అక్కడే ఉండిపోయారామె. ఈ ఏడాది ఫిబ్రవరి దాకా అక్కడే ఉండాల్సి రావచ్చు. అయినప్పటికీ భూమికి పంపిన ప్రతి చిత్రంలోనూ చిరునవ్వుని చెరగనివ్వకుండా నిండైన నిబ్బరాన్ని ప్రదర్శిస్తున్నదామె. ఈ ఏడు మహిళాలోకం సాధించిన ఘన విజయాల్లో ఆమె ధైర్యం కూడా తప్పకుండా ఉంటుంది.