ట్రావెలింగ్.. రోజుకో కొత్తరూపు దాలుస్తున్నది. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ప్రయాణ విధానాలు, నియమాలను.. జెన్-జీ తరం సమూలంగా మార్చేస్తున్నది. ప్రస్తుతం.. ‘స్లో ట్రావెలింగ్’ ట్రెండ్‌ను నవతరం ఎక్కువగా ఫాలో అవుతున్నది. ఉరుకులు పరుగుల ప్రయాణాలను పక్కన పెట్టేసి.. నచ్చిన ప్రాంతాలను మనసుపెట్టి చుట్టి వస్తున్నది.
ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండటం, స్థానిక జీవితాన్ని మరింత లోతుగా తెలుసుకోవడం.. స్లో ట్రావెలింగ్ ప్రధాన ఉద్దేశం. జెన్-జీ తరం ట్రావెలర్లు.. ఈ రకమైన ట్రావెలింగ్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి యాత్రల ద్వారా.. అర్థవంతమైన అనుభవాలను సొంతం చేసుకుంటున్నారు. సందర్శించిన ప్రాంతాలతో సాంస్కృతికంగా లీనమవుతున్నారు. మరోవైపు ఓ రకంగా పర్యావరణానికీ మేలు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ప్రాంతాలన్నీ ఓవర్ క్రౌడ్‌తో కిటకిటలాడుతున్నాయి. వెనిస్ నుంచి బార్సిలోనా వరకు.. ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. మితిమీరిన విమాన ప్రయాణాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్నది. అదే.. స్లో ట్రావెలింగ్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక లక్షల సంఖ్యలో సందర్శకుల రాకతో ఆదాయం వస్తున్నా.. కాలుష్యం కూడా అదే స్థాయిలో పెరుగుతున్నది. అంతేకాకుండా.. వేగవంతమైన ప్రయాణ ప్రణాళికలతో త్వరగా అలసిపోతుంటారు. అదే.. స్లో ట్రావెలింగ్ ద్వారా ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ప్రజలు, ప్రదేశాలతో నిజమైన సంబంధాలు ఏర్పడతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు మద్దతు లభిస్తుంది. ఇలాంటి ప్రయాణాలు మానసిక ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాయని ట్రావెల్ నిపుణులు చెబుతున్నారు.
స్లో ట్రావెలింగ్ చేయడం చాలా సులభం. ఏడు రోజుల్లో నాలుగైదు నగరాలను సందర్శించే బదులు.. ఒకే ప్రాంతాన్ని ఎంచుకొని, వారంపాటు అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పేరెన్నికగన్న హోటల్స్‌ను పక్కనపెట్టేసి.. రోడ్డు పక్కన బేకరీలు, వీధి చివరన దుకాణాలు, రైతు మార్కెట్లలో ఆహారం తీసుకుంటున్నారు. దీనిద్వారా వారికి మెరుగైన భోజనం చౌకగా దొరుకుతున్నది. వారి డబ్బు కూడా నేరుగా స్థానికుల చేతుల్లోకే వెళ్తున్నది. స్లో ట్రావెలింగ్‌లో భాగంగా.. స్థానికులతో ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక టూర్ ముగిసిన తర్వాత ఫొటోలను తిరగేసినప్పుడు.. ఆ యాత్ర ఏదో సుడిగాలి పర్యటనలా అనిపించదు. మీరు తిరిగిన ప్రదేశాలతో సహా.. కలిసిన వ్యక్తులు, రుచి చూసిన ఆహారం అన్నీ మరోసారి కళ్లముందు కదలాడుతాయి. ఆ జ్ఞాపకాలన్నీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అందుకే, యాత్రలను ఆదరాబాదరాగా కాకుండా.. నిదానంగా చూసి వస్తేనే.. నిజమైన తృప్తి లభిస్తుంది!