ఉరుకులు పరుగుల జీవితంలో.. ఊపిరి సలపని పనులతో బతికేస్తున్నారు. ప్రశాంతత కోసమని విహారయాత్రకు వెళ్లినా.. ఎక్కడా పట్టుమని పది నిమిషాలు ఉండలేకపోతున్నారు. ఒకే టూర్లో నాలుగైదు ప్రాంతాలను ఎంచుకొని.. చకచకా చుట్టేస్తున్నారు. అయితే, పర్యాటకం అంటే కేవలం ఫొటోలు దిగిరావడమే కాదని.. జెన్-జీ ట్రావెలర్లు అంటున్నారు. ‘సందర్శనకు వెళ్లిన ప్రాంతాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడం’ అని చెబుతున్నారు. ఇందుకోసం.. ‘స్లో ట్రావెల్’ చేయాలని సలహా ఇస్తున్నారు.
‘స్లో ట్రావెల్’… జెన్ జెడ్ ఎక్కువగా ఫాలో అవుతున్న ట్రెండ్. వాళ్ల అభిప్రాయంలో.. ఇలా నెమ్మదిగా ప్రయాణించడం అనేది ఒక టూర్ కాదు. అదొక ఫిలాసఫీ! స్థలాలను వీక్షించడానికి బదులుగా.. ఆయా ప్రాంతాల అనుభూతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పదిరోజుల్లో పదిహేను సందర్శనా స్థలాలు చుట్టేయకుండా.. ఒకే పర్యాటక కేంద్రంలో వారం రోజులు ఉండిపోతున్నారు. అక్కడి సంస్కృతిని ఆస్వాదిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలతోపాటు స్థానిక ప్రజల జీవన విధానాలనూ తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పర్యావరణ స్పృహతోనూ మెదులుతున్నారు. విమానాలు, సొంత వాహనాలకు బదులుగా.. రైళ్లు, కొందరైతే నడకతోనూ ప్రయాణించి పర్యావరణానికి మేలు చేస్తున్నారు.
‘స్లో ట్రావెలింగ్’తో అనేక లాభాలు ఉన్నాయని ట్రావెలింగ్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ప్రయాణ సమయంలో ఉండే ఒత్తిడి..
ఈ స్లో ట్రావెలింగ్‌లో ఉండదు. రైలు, ఫ్లయిట్ మిస్ అవుతుందనే టెన్షన్ అక్కర్లేదు. ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించవచ్చు. ఇక ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఒకేచోట ఎక్కువ రోజులు ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి. హోటల్స్‌కు బదులుగా.. హోమ్‌స్టేలను ఎంచుకుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది. సందర్శించిన ప్రాంతంతో గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. అక్కడి భాష, ఆహారం, ఆచారాలను లోతుగా అర్థం చేసుకోవచ్చు. స్థానిక వ్యాపారులకూ ఆర్థికంగా తోడ్పడవచ్చు.
స్లో ట్రావెలింగ్ చేయడానికి కొన్ని టిప్స్ కూడా అందిస్తున్నారు.