చూసేందుకు చిన్నసైజు కొబ్బరి చెట్టులా ఉండే అరెకా పామ్.. అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. వేసవిలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇదో ‘లివింగ్ హ్యూమిడిఫైయర్’ లాంటిది. గాలిలో తేమను పెంచి.. ఇంటికి సహజసిద్ధమైన చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలో కరెంటుతో పనిలేని ఓ మినీ ఏసీలా పని చేస్తుంది. ఆరు అడుగుల ఎత్తుండే ఒక అరెకా పామ్ మొక్క.. రోజుకు సుమారు లీటరు నీటిని ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేస్తుంది. దాంతో గదిలో పొడి గాలి తగ్గి.. చల్లదనం పెరుగుతుంది. అంతేకాదు, గాలిని శుద్ధి చేయడంలోనూ ఈ మొక్క టాప్ లిస్టులో ఉంటుంది.
గాలిలోని ఎసిటోన్, జైలీన్, టోలుయీన్ వంటి హానికరమైన విష రసాయనాలను సమర్థంగా తొలగిస్తుంది. ఈ విషయాన్ని నాసా కూడా గుర్తించింది. ముఖ్యంగా, కొత్తగా పెయింట్ వేసిన ఇళ్లలో, కొత్త ఫర్నిచర్ ఉన్న గదుల్లో ఈ మొక్కను ఉంచడం చాలా మంచిది. ఈ మొక్కలో పుప్పొడి శాతం తక్కువ. దాంతో, శ్వాసకోశ సమస్యలు, సైనస్ ఉన్నవారు ఇళ్లలో పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది పెట్ ఫ్రెండ్లీ. పెంపుడు జంతువులు పొరపాటున దీని ఆకులు తిన్నా.. ఎలాంటి అలర్జీలు రావు. ఇక అరెకా పామ్ పొడవాటి ఆకులు.. ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి.