కవిత్వం రాయడమంటే.. అదో బ్రహ్మ విద్య అని చాలామంది అనుకుంటారు. మనసులో ఎన్నో భావాలు ఉన్నా, వాటిని అందమైన పదాల్లో ఎలా చెప్పాలో తెలియక అక్కడే ఆగిపోతుంటారు. కానీ, కాలం మారింది! మీకు పద్యం రాయాలని ఉందా? మీ ప్రియమైన వారికి ఒక అందమైన ప్రేమ కవితను పంపాలని ఉందా? అయితే మీ స్మార్ట్ఫోనే ఇప్పుడు ఓ ‘కవికోకిల’లా మారిపోతుంది. తాజా ఏఐ అప్లికేషన్లు మన ముఖ కవళికలను, మనసులోని మూడ్‌ని బట్టి కవితలు అల్లి పెట్టేస్తున్నాయి.
ఇప్పటివరకు మనం ఏదైనా టాపిక్ ఇస్తే ఏఐ రాయడం చూశాం. కానీ ఇప్పుడు ‘జీపీటీ-5’ వంటి అధునాతన మాడళ్లు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, మనం కోరుకున్న ‘ఎమోషన్’ని కూడా కవితలో పలికిస్తున్నాయి. మీరు విచారంగా కనిపిస్తున్నారా? లేక ఉత్సాహంగా ఉన్నారా? అనేది చెబితే చాలు.. దానికి తగిన పదాలను ఏఐ ఎంచుకుంటుంది. ఒకే యాప్‌లో (Poe వంటివి) విభిన్నమైన ఏఐ మోడళ్లను వాడుతూ.. మీరనుకున్న కవితను రూపొందించుకోవచ్చు. అది ప్రాసలతో కూడిన పద్యమా? లేక వచన కవితా? అనేది మీరే నిర్ణయించవచ్చు.
కేవలం అక్షరాలే కాదు, ఆ కవితకు తగ్గట్టుగా అందమైన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లను కూడా ‘కాన్వా’ (Canva) వంటి ఏఐ టూల్స్ తయారు చేస్తున్నాయి. విజువల్ మ్యాజిక్: మీరు రాసిన కవితలోని సారాంశాన్ని బట్టి ఏఐ ఒక చిత్రాన్ని గీస్తుంది. దీన్ని నేరుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తే చూసేవారికి అదొక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఉచితం.. సులభం: క్విల్ బాట్ (QuillBot), గ్రామర్లీ (Grammarly) వంటి టూల్స్ ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా, నిమిషాల వ్యవధిలోనే కవితలను ఎడిట్ చేసుకోవచ్చు, మెరుగుపరచుకోవచ్చు.
మీ మనసులోని భావాలను అక్షర రూపంలోకి మార్చడానికి ఏఐ మంచి సాధనం. పదాలు ఏఐ ఇచ్చినప్పటికీ, భావం మాత్రం మీదే అయి ఉండాలి. అప్పుడే ఆ కవిత్వానికి నిండుదనం వస్తుంది. మరెందుకు ఆలస్యం? ఏఐ సాయంతో మీ జ్ఞాపకాలను, ఆవేదనలను, ఆనందాలను కవితలుగా మలిచి
పదికాలాల పాటు దాచుకోండి.