జగిత్యాల, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు, చరిత్ర సబ్జెక్టులో అనేక పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, జగిత్యాల జిల్లావాసి డాక్టర్ జైశెట్టి రమణయ్య(87)శుక్రవారం తెల్లవారుజామున స్వగృహంలో కన్నుమూశారు. బోధనారంగంలో విశేష సేవలందించిన ఆయన, కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. 17వ ఏట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా బోధనను ప్రారంభించిన రమణయ్య, నలభై ఏండ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్తానంలో వేలాది మందికి బోధన చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం ఇంటర్మీడియెట్‌లో చరిత్ర లెక్చరర్‌గా బోధించారు.
రమణయ్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. 1939లో జన్మించిన ఆయన ప్రాథమిక విద్య, మెట్రిక్యులేషన్ కోర్సును జగిత్యాలలోనే పూర్తి చేశారు. మెట్రిక్యులేషన్ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొంది 1955లో తొలిసారిగా వెల్గటూర్ మండలం కిషన్రావుపేట పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఉద్యోగోన్నతులు పొందారు. బీఏ పూర్తి చేసిన తదుపరి పాఠశాల ఇన్స్పెక్టర్గా ఉద్యోగోన్నతి పొందారు. ఆ పైన జగిత్యాల మల్టీపర్పస్ హైస్కూల్లో సాంఘిక, ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేశారు. చరిత్ర సబ్జెక్టులో పీజీ పూర్తి చేశారు. 1970లో రమణయ్య లెక్చరర్‌గా ఉద్యోగోన్నతి పొంది సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే కేసీఆర్‌కు ఇంటర్మీడియెట్‌లో హిస్టరీ సబ్జెక్టు బోధించారు. 1974లో సిద్దిపేట నుంచి జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీకి బదిలీ అయ్యారు. 1985లో సెంట్రల్ యూనివర్సీటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. 1996లో ఉద్యోగ విరమణ పొందారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్యూమరేట్గా ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
తనకు చదువు చెప్పిన గురువు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య మరణంపై తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విచారం వ్యక్తం చేస్తూ శుక్రవారం సంతాపం ప్రకటించారు. గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో ఇంటర్మీడియట్ విద్యార్థిగా తాను విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రమణయ్య మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. రమణయ్య మృతి వార్త తెలియగానే పలువురు ప్రముఖులు, ఆయన శిష్యులు ఇంటికి వెళ్లి రమణయ్య పార్థివదేహానికి నివాళులర్పించారు.