శ్రీసైని.. మిస్ వరల్డ్ అమెరికా కిరీటం ధరించిన తొలి భారతీయ మహిళ. పంజాబ్లో ఆమె మూలాలున్నాయి. గత ఏడాది ఇక్కడికి వచ్చింది కూడా. తను ఆరో తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో అమెరికా వెళ్లింది. ‘నేను నూటికి నూరుశాతం భారతీయురాలిని. నూటికి నూరుశాతం అమెరికన్ను కూడా’ అంటూ నవ్వేస్తుంది శ్రీసైని. స్కూల్లో చాలా అవమానాలే ఎదుర్కొంది ఆ చామన ఛాయ పిల్ల. తరచూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికెళ్లేది.
‘సమస్యలు మనకు భయపడాలి కానీ, మనం సమస్యలకు భయపడటం ఏమిటి?’ అంటూ తల్లి సున్నితంగా మందలించేది. మాడలింగ్లో అడుగుపెట్టాక కూడా వివక్ష తప్పలేదు. ఓ దశలో గుండె సమస్య దవాఖాన పాలు చేసింది. టీనేజ్లో జరిగిన ప్రమాదం మొహానికి గాయాలు మిగిల్చింది. ఇప్పటికీ ఆ మచ్చలు కనిపిస్తాయి. ‘నేను యథాతథంగా ప్రపంచం ముందుకు వచ్చాను. అందాలపోటీలో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు అంతే ధైర్యంగా జవాబిచ్చాను’ అని కుండ బద్దలుకొడుతుంది. ‘సినిమాల పట్ల నాకు పెద్దగా ఆసక్తి లేదు. వీలైతే.. ఏవైనా స్వచ్ఛంద సంస్థల తరఫున సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన ఉంది. దీనివల్ల నాలుగు జీవితాలను మార్చినవాళ్లం అవుతాం’ అంటున్నప్పుడు ఆ అందగత్తెలోని హృదయ సౌందర్యమూ జిగేలుమంటుంది.