‘కల కానిది.. విలువైనది!’.. మహాకవి శ్రీశ్రీ సినీ గీత రచయిత కావడం ఎవరి కలో తెలియదు! 1950లో ‘ఆహుతి’ చిత్రంతో విలువైన సాహిత్యం తెలుగు సినిమాకు వరంగా లభించింది. విప్లవ సాహిత్యంలో ‘ఖడ్గసృష్టి’ సృజించిన ఆయన వెండితెరపై మాత్రం ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ని చూపించారు. ఓసారి ‘పాడవోయి భారతీయుడా..’ అని ఆడి పాడే విజయగీతిక అందించారు. మరోసారి ‘పాడవేల రాధిక..’ అంటూ ప్రణయ సుధా గీతికను వినిపించారు. ఆ మహాకవి జయంతి నేడు. ఈ సందర్భంగా సినీ ప్రస్థానంలో శ్రీశ్రీ తోటలో విరిసిన గీత లతలను తలుచుకుందాం..
‘రెండు శ్రీలు ధరించి.. రెండు పెగ్స్ బిగించి.. వరలు శబ్ద విరించి..’ అని కూనలమ్మ పదాల్లో శ్రీశ్రీని వర్ణించారు ఆరుద్ర. ఒక్కో పాటకు ఎన్ని పెగ్స్ బిగించేవారో తెలియదు కానీ, సినిమాలకు ఆయన అందించిన గీతాలు మాత్రం ఎన్ని తరాలైనా ఎవర్గ్రీన్ ప్లే లిస్ట్‌లో ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి. పదాలతోనే ‘పదండి ముందుకు.. పదండి తోసుకు..’ అని వెంటపడి తరిమిన ఆయన కలం.. సినిమా దగ్గరికి వచ్చేసరికి పిల్లతెమ్మర వీవనలు వీచింది. ‘నా హృదయంలో నిదురించే చెలి..’ గీతంతో మహాకవి ప్రేమికులను పలకరించారు. ‘హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి..’ అని కొత్తజంటపై మత్తు మందుజల్లారు. ‘జోరుగా హుషారుగా షికారు పోదమా..’ అంటూ హాయిహాయిగా ఆలపించుకునే పాటను నివేదించారు. డాక్టర్ చక్రవర్తి సినిమాలో ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై..’ పాట రాసింది శ్రీశ్రీనే! మనసు కవి ఆత్రేయ అనుకుంటారు చాలామంది. మనసు పెట్టి పాటంతా వింటే చరణంలో ‘ఆశలు రేగే ఆవేశములో.. ఆశయాలలో.. ఆవేదనలో.. చీకటి ముసిరిన ఏకాంతములో..’ అని శ్రీశ్రీ మార్కు పదాల పోహళింపు చెవికి ఇంపుగొలుపుతుంది. మహాప్రస్థానంలోని ‘ఆనందం అర్ణవమైతే.. అనురాగం అంబరమైతే..’ గీతిక ‘కన్యాశుల్కం’ సినిమాలో పాటగానూ అలరించింది.
గీతోపదేశం
సినిమాల కోసం శ్రీశ్రీ రాసిన ప్రబోధాత్మక గీతాలు ‘ఎవరో వస్తారని.. ఎదురుచూసి మోసపోకుమా..’ అని హెచ్చరిస్తూ నిజం తెలిసి మసులుకోమని హితవు పలికాయి. ‘ఉందిలే మంచి కాలం ముందుముందునా..’ అని భరోసానిచ్చాయి. ‘అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యం ఉన్నటులే.. శోకాల మరుగున దాటి సుఖమున్నదిలే..’ అని శ్రీశ్రీ చేసిన ఉపదేశం.. నిస్పృహలో కూరుకున్న ఎందరికో శోధించి సాధించే ధీరగుణాన్ని ప్రసాదించింది. ‘సాధించిన దానికి సంతృప్తిని పొంది.. అదే విజయమనుకుంటే పొరపాటోయి..’ ప్రతి భారతీయుడికీ కర్తవ్యాన్ని నిర్దేశించిన గీతం నేటికీ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ‘తెలుగువీర లేవరా..’ అని వెన్నుతట్టే సాహిత్యంతో తెలుగు పాటకు తొలి జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన శ్రీశ్రీ.. సినిమా పాటల తోటలో వసివాడని ఎర్రమందారం.
వీటూరి పల్లవి.. శ్రీశ్రీ చరణం..
‘దేవత’ సినిమాలో ‘బొమ్మను చేసి.. ప్రాణము పోసి.. ఆడేవు నీకిది వేడుక’ పాటకు కథా, గీత రచయిత వీటూరి పల్లవి రాశారట. చరణాలు ఎంతకూ కుదరకపోవడంతో ఆ బాధ్యతను శ్రీశ్రీకి అప్పగించారు. ‘ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ.. అదియే మరు భూమిగా నీవు మార్చేవులే..’ అని మహాకవి రాసిన చరణాలు ఆ చిత్ర కథా గమనానికి తగ్గట్టుగా కుదిరాయి.
మరికొన్ని మధుర గీతాలు..
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట..
కళ్లలో పెళ్లిపందిరి కనబడసాగే..
ఏమని పాడెదనో ఈ వేళ.. మానసవీణ మౌనముగా..
దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లారా..
ఎవరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే..
కలిసి పాడుదాం తెలుగు పాట..
మనిషే మణిదీపం.. మనసే నవనీతం..
ఇలాగ వచ్చి అలాగ తెచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి
ఎవరివో నీవెవరివో..
వాడిన పూలే వికసించెనే..
సమరానికి నేడే ప్రారంభం.. యమరాజుకు మూడెను ప్రారబ్ధం..