Ileana d cruz | కారణాలు ఏమైతేనేం.. ప్రసవానంతర డిప్రెషన్‌పై చర్చ తక్కువగానే జరిగింది. ఇప్పుడిప్పుడే మహిళలు గొంతెత్తుతున్నారు. మనసు విప్పుతున్నారు. ఆ జాబితాలో తాజాగా చేరారు.. నటి ఇలియానా డిసౌజా. గత ఏడాది తను పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత కొంతకాలం ప్రసవానంతర డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఆ చేదు అనుభవాల్ని పంచుకుంటూ.. ‘అదో సంక్షోభ సమయం. ఎవరూ మనల్ని మానసికంగా సిద్ధం చేయరు.
మనకు మనమే రక్షణ కవచం నిర్మించుకోవాలి. అన్నిసార్లూ అది సాధ్యం కాకపోవచ్చు. నా విషయంలోనూ అలానే జరిగింది. అకారణ దుఃఖం పొంగుకొచ్చేది. ఆ సమయంలో మా అమ్మ అండగా నిలబడింది. వైద్యుల బృందం సాయపడింది. అన్నట్టు మా బాబు పేరు చెప్పనేలేదు కదూ.. కోవా ఫీనిక్స్ డోలాన్. ఈ ఏడాది తనకే అంకితం. కొన్ని సినిమాలు అంగీకరించే ఆలోచన ఉంది. మా బుజ్జి బాబును కూడా షూటింగ్‌కు తీసుకెళ్తాను. గ్యాప్‌లో ఆడుకోవచ్చు. స్త్రీకి మాతృత్వం ఎంత ముఖ్యమో, కెరీర్ కూడా అంతే ప్రధానం’ అంటారామె..