Tarla Dalal Biopic | ‘వంటలక్క’ అంటే ‘కార్తీక దీపం’ సీరియల్ వంటలక్క అనుకునేరు. ఆమెకంటే పెద్ద వంటలక్క ఒకరున్నారు. నేటితరం కుక్‌లకు తను రోల్‌మోడల్. పాకశాస్త్ర ‘పద్మశ్రీ’ తరళా దలాల్ జీవితం సకల రుచుల సమాహారం.
ఒక షెఫ్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడం బాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి. దంగల్, చిచోరే వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన పీయూష్ గుప్తా ఈ సినిమాకు దర్శకుడు. సంతోషం-తీపి, కోపతాపాలు-కారం, అవమానాలు-చేదు.. ఇలా వంటల్లోని రుచులన్నీ తరళా దలాల్ జీవితంలోనూ ఉన్నాయి. పాకశాస్త్ర పెద్దక్క తరళ పాత్రలో హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు.
తరళా దలాల్ 1936లో జన్మించారు. పుణెలో పెరిగిన తరళకు చిన్నప్పటి నుంచీ వంటలంటే ఇష్టం. పెండ్లి తర్వాత ఆమె ముంబైకి మారిపోయారు. ముగ్గురు పిల్లల తల్లిగా ఏ పూటకు ఏం వండాలి? వాటిలో కేలరీల శాతం ఎంత? పోషక విలువలు ఏ మేరకు ఉంటాయి? మొదలైన లెక్కలన్నీ చూసుకునేవారు. ఆ అనుభవంతోనే ఇంట్లోనే ‘వంట తరగతులు’ ప్రారంభించారు. ఎందరినో షెఫ్‌లుగా తీర్చిదిద్దారు. అప్పట్లో ‘అమ్మాయికి వంటొచ్చా?’ అన్నది పెండ్లిచూపుల్లో మొదటి ప్రశ్న కాబట్టి.. వివాహ ప్రయత్నాలు ప్రారంభించగానే ఆడపిల్లల తల్లిదండ్రులు కూతుళ్లను తరళ దగ్గర వంటల ట్యూషన్‌కు పంపేవారు.
తరళా దలాల్ 1974లో తొలిసారిగా ‘ది ప్లెజర్ ఆఫ్ వెజిటేరియన్ కుకింగ్’ అనే పుస్తకాన్ని రాశారు. అది లక్షన్నర కాపీలు అమ్ముడైంది. ఆ తర్వాత, రెండువందలకు పైగా వంటల పుస్తకాలు రాశారు. ప్రపంచంలోనే టాప్-5 పాకశాస్త్ర రచయితల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. www. tarladalal.com వెబ్సైట్ ఓ గ్లోబల్ పాకశాల. ఆమె ఓ ద్వైమాసిక పత్రికను కూడా నడిపారు. టీవీ చానళ్లలో అనేక వంట కార్యక్రమాలు నిర్వహించారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పాక శాస్త్రం పునాదిగా అంతటి గౌరవం అందుకున్న ఏకైక మహిళ తరళ. ఆంత్రప్రెన్యూర్‌గా, వంటల పుస్తకాల రచయిత్రిగా, సెలెబ్రిటీ షెఫ్‌గా పేరుగాంచిన తరళా దలాల్ 2013లో చనిపోయారు. ఓ సాధారణ గృహిణి స్టార్ షెఫ్‌గా ఎదిగిన తీరును వెండితెర ఎలా ఆవిష్కరిస్తుందో చూడాలి.
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
“Kanna Ooru | ఒక్క జిల్లా నుంచి ఎస్సై జాబులు కొట్టారు.. కన్న ఊరు రుణం తీర్చుకుంటున్నారు”