Curator Annapurna | జీవితమే ఒక సినిమా. ఆ సినిమా జీవితంలో ఎలా ఉంటుందో చూడాలంటే ‘చిత్రం’ ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించాల్సిందే! ఇది వెండితెర చిత్రం కాదు.. వెండితెర విచిత్రాలెన్నో చెప్పే కదలని చిత్రాల కథ! ‘చిత్రం భళారే విచిత్రం’ అనిపించే ఈ ప్రదర్శనకు కాన్సెప్ట్ (కథ), డిస్ప్లే (స్క్రీన్‌ప్లే ), క్యూరేటర్ (డైరెక్టర్).. అన్నపూర్ణ మడిపడగ. సినిమా దర్శకత్వంలో మహిళలు ఎంత తక్కువో, ఆర్ట్ క్యూరేటర్లుగానూ అంతే తక్కువ. హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సినిమా చరిత్రను చెబుతున్న.. ఆర్ట్ క్యూరేటర్ అన్నపూర్ణ కథ ఇది.
మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహిస్తున్న ‘చిత్రం’ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆలోచన రెండేండ్ల్ల నాటిది. అప్పుడు, దేశమంతా కొవిడ్ మహమ్మారి భయంతో ఉంది. మనిషిని చూసి మరో మనిషి దూరంగా వెళ్తున్న కాలం. ఎవరి ఇండ్లలో వాళ్లున్నారు. ఆ సమయంలో సినిమా వినోదాన్ని పంచింది. ఒత్తిడిలో ఉన్నవాళ్లకు ప్రశాంతతను, ఒంటరిగా ఉన్నవాళ్లకు కాలక్షేపాన్ని, బాధలో ఉన్నవాళ్లకు సంతోషాన్ని ఇచ్చింది. ఆ సహాయానికి వెండితెరను నిండుగా అభినందించాల్సిందేనని అనుకున్నది అన్నపూర్ణ. సినిమా ఇతివృత్తంగా ఒక ఆర్ట్ షో చేయాలని ఆలోచించింది. ఎలా చేయాలో నిర్ణయించుకోవడానికే ఏడాదిపాటు పరిశోధన చేసింది. సినిమా జోనర్లో కృషి చేస్తున్న ఆర్టిస్టుల్ని గుర్తించి, చర్చించి, ఆ కళాఖండాలన్నిటినీ ఒకే గ్యాలరీలో ప్రదర్శించేందుకు ఇంకో ఏడాది కాలం పట్టింది. అదే ఇప్పుడు నడుస్తున్న ‘చిత్రం’ షో.
జేఎన్టీయూలో ఎంఎఫ్ఏ పూర్తయిన తర్వాత అన్నపూర్ణ ఒక గ్యాలరీలో ఉద్యోగానికి చేరింది. అక్కడే క్యూరేటర్‌గా ఆమె మొదటి షో ‘డివైన్’ విజయవంతం అయింది. క్యూరేటర్ అంటే మాటలు కాదు. తాను పనిచేస్తున్న గ్యాలరీ కోసం ఏడాది కాలానికి క్యాలెండర్ తయారు చేయాలి. షోలకు కాన్సెప్ట్, థీమ్, టైటిల్స్ సిద్ధం చేసుకోవాలి. ఆ జోనర్ ఆర్టిస్టుల్ని కలిసి, వాళ్ల పనిని బేరీజు వేసి, అవసరం అనుకుంటే మార్పులు చేర్పులు సూచించి.. ఎగ్జిబిషన్ సక్సెస్ అయ్యేలా చూడాల్సిన పూర్తి బాధ్యత క్యూరేటర్దే. ఆర్ట్, మార్కెటింగ్, నెట్ వర్కింగ్.. ఇలా సకల నైపుణ్యాల సమాహారం ఈ బాధ్యత.
ఫైన్ ఆర్ట్స్ చదివిన వాళ్లు ఆర్టిస్ట్ కావాలనుకుంటారు. కానీ, అన్నపూర్ణ మాత్రం ఆర్టిస్టుల ప్రతిభను గుర్తించి ప్రశంసించే బాధ్యతను ఎంచుకుంది. క్యూరేటర్‌గా తననుతాను నిరూపించుకోవడానికి కళా చరిత్రను అధ్యయనం చేసింది. నిజానికి ఈ దారి ఎంచుకున్న వాళ్లు చాలా తక్కువ. ఇక ఆడవాళ్లంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఆ అరుదైన నైపుణ్యం అన్నపూర్ణకు అయాచితంగా రాలేదు. అదో కథ. ‘నేను ఫైన్ ఆర్ట్స్ చదవడం కాదు. నా జీవితమే ఆర్ట్. మా నాన్న ఫైన్ ఆర్ట్స్ చదివారు. అడ్వర్టయిజింగ్ కంపెనీ నడుపుతూనే ఇంట్లో పెయింటింగ్స్ గీసేవారు. వాటిని చూస్తూ పెరిగాను. మా ఇంట్లో పెయింటింగ్స్ వేలాడని గోడ అంటూ లేదు. చిన్నప్పుడు వాటిని తదేకంగా చూస్తూ గంటలకొద్దీ గడిపేదాన్ని. నన్ను హిమాయత్‌నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో చేర్పించారు. అక్కడ ఆర్ట్ వర్క్‌షాప్స్ నడిపేవాళ్లు. అక్కడ లేనిదంటూ లేదు. నేను నేర్చుకోనిదీ లేదు. వేసవిలో నాన్న నన్ను ప్రముఖ ఆర్టిస్టుల దగ్గరికి పంపేవాడు. వాళ్లంతా గొప్పగొప్ప చిత్రకారులే కావచ్చు. కానీ నా మీద మా నాన్న ప్రభావమే ఎక్కువ. నేర్పినవాళ్లు బొమ్మ ఎలా గీయాలో చెప్పారు. కానీ, నాన్న నన్ను ఎన్నోసార్లు సాలార్జంగ్ మ్యూజియానికి తీసుకెళ్లాడు. అక్కడి పెయింటింగ్స్‌లో ఏది గొప్పదో వివరించాడు. ఆ శైలి కోసం ఆర్టిస్ట్ ఎంత కష్టపడి ఉంటాడో ఒక్కసారి ఊహించమనేవాడు. కలరింగ్ బ్యాలెన్స్ గురించీ బోధించేవాడు. ఆ నైపుణ్యాలు ఇప్పుడు పనికొస్తున్నాయి. ఏదైనా చిత్రాన్ని నాదైన పద్ధతిలో వర్ణించడం, కళా చరిత్రను వివరించడం
తెలియబట్టే నేను క్యూరేటర్‌గా విజయం సాధించాను. మహిళ జన్మతః కళాభిమాని. ఈ రంగంలోకి మరింతమంది స్త్రీలు రావాల్సిన అవసరం ఉంది.
“మొదటి ఉద్యోగంలో.. ఓ గ్యాలరీలో రెండేండ్లు పనిచేసి బయటికి వచ్చాను. మొదటి సినిమా హిట్ అయినంత మాత్రాన డైరెక్టర్‌కు పేరు రాదు. రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితేనే అతనిలో ప్రతిభను పరిశ్రమ, సమాజం గుర్తిస్తాయి. నాకూ అంతే. వరుసగా షోలు సక్సెస్ అయిన తర్వాతే పేరు వచ్చింది. చెన్నైలోని ‘గ్యాలరీ వేద’ వాళ్లు నన్ను ఆహ్వానించారు. వాళ్ల కోసం మూడు ఆర్ట్ షోలు చేశాను. వచ్చే అక్టోబరులో అక్కడే ఇంకో షో చేస్తాను. దానితోపాటు మరో రెండు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఈ ఏడాదిలో చేయాల్సి ఉంది. మా నాన్న వేలుపట్టుకుని ఈ కళా ప్రపంచంలోకి నడిపించాడు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చినా ఆ ప్రయాణం మాత్రం ఆగిపోలేదు. మా ఆయన హిమదీప్ ఇప్పుడు నాకు అండ. నేను ఆర్ట్‌ని అభినందించినట్టే, ఆయన నా ప్రయత్నాన్ని అభినందిస్తుంటారు” అంటున్నది అన్నపూర్ణ.
– నాగవర్ధన్ రాయల
మూడు తరాల వ్యాపారాన్ని సక్సెస్‌గా రన్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్న మెట్రో సిస్టర్స్”
వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి.. ముఖేశ్ అంబానీ గారాలపట్టి చెప్పిన విజయసూత్రాలివే..”
అన్నదాతలకు అండగా నిలబడిన హైదరాబాదీ ఆడబిడ్డ.. ఆమె ఏం చేస్తుందంటే..”
Engineers Biryani | జాబు వదిలేసి బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు”