కరోనా మహమ్మారి కారణంగా అంతా ఇంట్లోనే గడుపుతున్నారు. జిమ్, జాగింగ్, రన్నింగ్ వంటివి లేక రోజంతా బద్ధకంగా బతికేస్తున్నారు. ఒంట్లో కొవ్వు పేరుకు పోతున్నది. మానసిక ఆరోగ్యమూ దెబ్బ తింటున్నది. ‘హూల హుప్’తో ఈ సమస్యలను అధిగమించొచ్చు.
హూల హుప్.. ఏరోబిక్స్ వ్యాయామంలో ఓ కొత్త రకం. ఒంట్లోని క్యాలరీలను, కొవ్వును సులువుగా తగ్గించే ఈ వ్యాయామాన్ని సినీతారలు ఫాలో అవుతున్నారు. అన్ని వయసులవారూ దీన్ని చేయవచ్చు. ఓ రింగ్‌ను నడుము చుట్టూ తిప్పుతూ శరీరం మొత్తాన్నీ కదిలిస్తే సరిపోతుంది. శరీర సమతుల్యతను మెరుగు పర్చడంలో, కండరాలను బలోపేతం చేయడంలో, కొవ్వును కరిగించడంలో హూపింగ్ ప్రధానపాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్యమూ మెరుగవుతుంది. దీనికి యోగాసనాల్ని జోడిస్తున్నారు. బెల్లీ డ్యాన్స్, సల్సా వంటి నృత్యాలతోనూ కలిపి చేస్తున్నారు. పనిలో పనిగా ధ్యానసాధన కూడా చేయిస్తున్నారు. కాకపోతే, నిపుణుల పర్యవేక్షణలో చేయకపోతే వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.