Mysaa | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటున్న ఈ భామ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘మైసా’ విడుదల తేదీ ఖరారైంది. ‘మైసా’ చిత్రాన్ని 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రష్మిక చేతిలో ఈటె పట్టుకుని, అత్యంత పవర్ఫుల్ లుక్‌లో కనిపించే ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఇప్పటివరకు గ్లామర్, లవ్, ఫ్యామిలీ, కామెడీ వంటి విభిన్న పాత్రల్లో కనిపించిన రష్మిక.. ‘మైసా’లో మాత్రం పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె గోండ్ గిరిజన మహిళ, తిరుగుబాటుదారిణి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పాత్ర కోసం రష్మిక తన లుక్, బాడీ లాంగ్వేజ్‌లోనూ భారీ మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ‘మైసా’ కథ గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అక్కడి ప్రజల జీవన విధానం, వారి నమ్మకాలు, సమస్యలు, పోరాటం వంటి అంశాలను కథలో చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రష్మిక పాత్ర చుట్టూనే కథనం ఎక్కువగా నడుస్తుందని టాక్.
ఈ సినిమాలో రష్మిక ఇప్పటివరకు చేయని యాక్షన్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించనుంది. చేతిలో ఈటె పట్టుకుని కనిపిస్తున్న పోస్టర్ చూస్తే.. సినిమాలో ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ సినిమా కోసం రష్మిక అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘మైసా’తో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్, అజయ్ సయ్యపురెడ్డి, శ్రీకాంత్ సాతి కలిసి అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. కథకు తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలు, గిరిజన నేపథ్యాన్ని ప్రతిబింబించే విజువల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే రష్మికకు 2026 చివరి రెండు నెలలు మరింత ప్రత్యేకంగా మారనున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘రణబలి’ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత కేవలం 42 రోజుల వ్యవధిలోనే ‘మైసా’ నవంబర్ 27న విడుదల కానుంది.