ఇప్పుడు బీపీ మానిటర్ పరికరాలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. చాలా ఇళ్లలో ఇవి కనిపిస్తున్నాయి. కాకపోతే కొందరు వీటిని సొంత వైద్యానికి ఉపయోగించుకోవటమే చిక్కు తెచ్చి పెడుతున్నది. రెండు, మూడు సార్లు రక్తపోటు నార్మల్ ఉన్నట్టు తేలగానే మందులు మానేయటం.. బీపీ పెరగ్గానే ట్యాబ్లెట్లు వేసుకోవటం చేస్తుంటారు చాలామంది.
ఇలాంటి తప్పు చేయొద్దని సూచిస్తున్నారు వైద్యులు. బీపీ మానిటర్ని సక్రమంగా వాడుకోవాలి. డాక్టర్ చెబితే తప్ప మాటిమాటికీ పరీక్షించుకోవద్దు. రోజుకోసారి చూసుకుంటే చాలు. రక్తపోటు ఫలితాలను కాగితం మీద రాసుకొని, డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు చూపించాలి. అంతే తప్ప సొంతంగా మందులు మానెయ్యటం, మోతాదు తగ్గించటం, పెంచటం లాంటివి చేయొద్దు.