ఏ భాషా చిత్రాల్లో అయినా యాక్షన్ జానర్ ఎవర్గ్రీన్. ఈ తరహా సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఎక్కువే. హీరోలు తెరపై చేసే పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ని పంచుతాయి. అయితే దక్షిణాదిన యాక్షన్ మూవీస్ హీరో ప్రధానంగానే సాగుతాయి. తెలుగులో ఒకప్పుడు విజయశాంతి వరుస యాక్షన్ చిత్రాలతో లేడీ అమితాబ్ అనే ఇమేజ్ను తెచ్చుకుంది. హిందీలో మాత్రం గత దశాబ్దకాలంగా యాక్షన్ చిత్రాల్లో అగ్రనాయికలు భాగమవుతున్నారు.కత్రినాకైఫ్, కరీనాకపూర్, దీపికా పదుకొణె, అలియా భట్ లాంటి తారలు భారీ యాక్షన్ చిత్రాల్లో సత్తా చాటారు. ఇప్పుడు తెలుగులో ఈ ట్రెండ్ ఊపందుకుంటున్నది. మన నాయికలు సైతం ఫైట్లకు సై అంటున్నారు. హీరోలకు మేమేం తక్కువ కాదంటూ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్‌తో ప్రేక్షకుల్నిఅలరించేందుకు సిద్ధమవుతున్నారు.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం తారాపథంలో దూసుకుపోతున్నది. ‘పుష్ప’, ‘యానిమల్’, ‘ఛావా’ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఈ అమ్మడి ఇమేజ్ శిఖరాగ్రానికి చేరింది. దాంతో ఆమె నటిస్తున్న తాజా చిత్రాలపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు అందం, అభినయం ఉన్న ప్రధాన పాత్రల్లో మెప్పించిన ఈ కన్నడ సొగసరి ‘మైసా’ చిత్రం ద్వారా కెరీర్లో తొలిసారి యాక్షన్ రోల్లో కనిపించబోతున్నది. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోండు తెగ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న వారియర్ ప్రిన్స్ పాత్రలో కనిపించనుంది. తన జాతి రక్షకురాలిగా ఆమె పాత్ర శక్తిమంతంగా సాగుతుందని చెబుతున్నారు. ‘కల్కి 2898ఏడీ’ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఆండిలాంగ్ ‘మైసా’ చిత్రం కోసం పనిచేస్తుండటం విశేషం. ఆయన సారథ్యంలో రష్మిక మందన్నపై తీసిన పోరాట ఘట్టాలు గూజ్బంప్స్ తెప్పించడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌లో రష్మిక డూప్ లేకుండా నటిస్తున్నదట. కెరీర్లో తొలిసారి ఫుల్‌లెంగ్త్ యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై రష్మిక స్పెషల్ కేర్ తీసుకుంటున్నదట. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేలా ఉన్నాయి.
విరూపాక్ష, సార్, బింబిసార చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ సోయగం సంయుక్త మేనన్. ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి తరహాలో సాత్విక పాత్రలకే పరిమితమైన ఈ అమ్మడు ఒక్కసారిగా పంథా మార్చింది. ‘ది బ్లాక్ గోల్డ్’ అంటూ తనలోని యాక్షన్ టాలెంట్‌ను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నది. ‘చింతకాయల రవి’ ఫేమ్ యోగేష్ దర్శకత్వంలో ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన లభించింది. తన హృదయానికి దగ్గరైన చిత్రమిదని, యాక్షన్‌తో పాటు ఇంటెన్స్ ఎమోషన్స్‌తో మెప్పిస్తుందని సంయుక్త ధీమా వ్యక్తం చేస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.
‘ఖుషీ’ చిత్రం తర్వాత తెలుగులో పూర్తిస్థాయి నాయిక పాత్రలో కనిపించలేదు అగ్ర తార సమంత. ఓటీటీ రిలీజ్ ‘శుభం’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆమె ‘మా ఇంటి బంగారం’ చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నది. ఈ సినిమాకు తనే నిర్మాత. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. టైటిల్‌ను బట్టి ఫ్యామిలీ కథాంశమిదని భావించారు. అయితే ఈ మధ్య విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో సమంత తుపాకీ పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిపించింది. ఇదొక వినూత్న కథాంశమని, క్రైమ్ కామెడీగా సాగుతుందని, సమంత పాత్ర ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా ఫిట్‌నెస్‌పై అధిక శ్రద్ధ చూపించే సమంత.. ఈ సినిమా కోసం మరింత ఫిట్‌గా తయారవ్వాలనే ప్రయత్నాల్లో ఉందట. ఈ సినిమాలో సమంతపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటాయని, ఆమెకు సరికొత్త ఇమేజ్ వస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

ఇక అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రూపొందుతున్న సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు అట్లీ భారీ యాక్షన్ హంగులతో పాన్ వరల్డ్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె పాత్ర హీరోకి దీటుగా ైస్టెలిష్‌గా ఉంటుందట. అధునాతన ఆయుధాలతో ఆమెపై భారీ యాక్షన్ ఘట్టాలుంటాయని చెబుతున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నదట దీపిక. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మలయాళీ భామ కీర్తి సురేష్ కెరీర్లో తొలిసారి ‘రివాల్వర్ రీటా’ పేరుతో యాక్షన్ మూవీలో నటిస్తున్నది. ఇటీవల విడుదలైన ప్రోమోలో ఫైట్ సీక్వెన్స్‌లో ఆమె అదరగొట్టింది. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ యాక్షన్ రోల్స్ కోసం దర్శకనిర్మాతలు తనను మొదటి చాయిస్‌గా పరిగణిస్తారని కీర్తి సురేష్ ధీమా వ్యక్తం చేస్తున్నది. దక్షిణాదికి చెందిన అగ్ర కథానాయికలు ఇలా వరుస యాక్షన్ ప్యాక్డ్ మూవీస్‌లో ప్రేక్షకులు ముందుకు రావడం సరికొత్త ట్రెండ్ అని, భవిష్యత్తులో ఈ తరహా చిత్రాలు మరిన్ని తెరకెక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సీనియర్ నాయిక అనుష్కశెట్టి గతంలో యాక్షన్ పాత్రల్లో మెరిసినా… ఇటీవల విడుదలైన ‘ఘాటీ’లో మాత్రం ఫుల్‌లెంగ్త్ యాక్షన్ రోల్లో కనిపించింది. ఘాటీ తెగ నేపథ్యంలో రూపొందించిన షీలావతి పాత్రలో అనుష్క చేసిన హంగామా అందరిని ఆకట్టుకుంది. నేరస్థురాలి నుంచి ఓ లెజెండ్‌గా ఆమె పయనాన్ని దర్శకుడు క్రిష్ ఈ సినిమాలో ఆవిష్కరించారు. ‘ఘాటీ’లో తాను డూప్ లేకుండా యాక్షన్ సీన్స్‌లో నటించానని, తన కెరీర్లో శారీరకంగా బాగా శ్రమకోర్చిన చిత్రమిదేనని అనుష్క పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. షీలావతిగా అనుష్క అభినయం, యాక్షన్ పెర్ఫార్మెన్స్కు మంచి పేరొచ్చింది.
– సినిమా డెస్క్