వేసవిలో షవర్ బాత్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పిల్లలు బాత్రూమ్లో పైనుంచి పడే నీటి జల్లుల్లో కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తారు. అయితే, ఈ షవర్ హెడ్‌లోనే ప్రమాదం పొంచి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా రోజుల వరకూ ఉపయోగంలో లేని షవర్ హెడ్లో హానికర బ్యాక్టీరియా పెరుగుతుందని చెబుతున్నారు. మన దగ్గర రెగ్యులర్‌గా షవర్ బాత్ చేయడం అరుదు. ఎప్పుడో ఓసారి.. అదికూడా వేసవిలోనే షవర్ కింద స్నానం చేస్తుంటారు. దాంతో, చాలారోజులు వాడకుండా ఉండే షవర్ హెడ్లో ‘బయోఫిల్మ్’ పేరుకుపోతుంది. అంటే, ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి.
జిగురులాంటి పదార్థాన్ని విడుదల చేసి.. పైపులు, షవర్ హెడ్స్ లోపలి భాగంలో అతుక్కుని ఉంటాయి. షవర్ ఆన్ చేసినప్పుడు.. నీటితోపాటుగా ఈ పొర నుంచి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా బయటికి వస్తాయి. అవి నీటితో కలిసి నోరు, ముక్కు, చెవుల గుండా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. లేనిపోని ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి. శ్వాసకోశ సమస్యలు, దీర్ఘకాలిక దగ్గు, అలసట, న్యుమోనియా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కొన్నిరకాల బ్యాక్టీరియాలు చర్మంపై పేరుకుపోయి.. దద్దుర్లు, దురద, కళ్లలో మంటతో ఇబ్బంది పెడతాయి. షవర్ మాత్రమే కాదు.. కొన్నిరోజుల పాటు ఉపయోగించని నల్లాల్లోనూ ఈ రకమైన బయోఫిల్మ్ ఏర్పడుతుంది. వారం రోజులు ఎటైనా వెళ్లి, మళ్లీ ట్యాప్ ఆన్ చేసినప్పుడు.. వృద్ధి చెందిన బ్యాక్టీరియా మొత్తం బకెట్లోకి వచ్చేస్తుంది. ఆ నీటితో స్నానం చేసినప్పుడు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.
వెచ్చని, తేమతో కూడిన ప్లంబింగ్ వాతావరణం.. సూక్ష్మజీవుల పెరుగుదలకు, వ్యాధికారకాల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, నల్లాలు, షవర్ హెడ్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.