బయట వేడిగా ఉన్న సమయాల్లో మన ఒంట్లో కూడా ఉష్ణం పెరుగుతూ ఉంటుంది. చెమటలు విపరీతంగా పట్టడంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లబరుచుకుని ఒంట్లో శక్తిని సమన్వయం చేసుకోవడానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కొన్ని సులువైన, ప్రభావవంతమైన చిట్కాలను సూచిస్తున్నారు.
సద్గురు ప్రకారం వేడిని గుర్తించడానికి చెమటలు పట్టడమే కాకుండా… కనుగుడ్లు వేడిగా అనిపించడం, మూత్ర విసర్జనలో మంట, మూత్రం వచ్చినప్పటికీ విసర్జించలేకపోవడం లాంటి లక్షణాలు తోడ్పడతాయి. ఈ లక్షణాలు బొడ్డు (మణిపూర), గుండె (అనాహతం), గొంతు (విశుద్ధి) లాంటి శక్తి కేంద్రాల్లో వేడిని పెంచుతాయి.
బూడిద గుమ్మడికాయ చల్లదనాన్ని, శక్తిని ఇచ్చే కూరగాయ. రోజూ పరగడుపునే బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకుంటే ఒంట్లో చల్లగా ఉంటుంది. అయితే, జలుబు, ఆస్తమా ఉన్నవాళ్లు మాత్రం ఈ జ్యూస్కు చిటికెడు మిరియాలపొడి గానీ, లేదంటే టీస్పూన్ తేనె గానీ కలుపుకోవాలి. పొద్దునే కాఫీ కంటే బూడిద గుమ్మడి జ్యూస్ మంచిది.
మొలకెత్తిన పెసర్లకు కూడా శరీరాన్ని చల్లబరిచే శక్తి ఉంటుంది. వీటిని పచ్చివిగా తిన్నా, తక్కువ మోతాదులో మసాలా దినుసులు కలుపుకొని ఓ మోస్తరు ఆవిరిలో ఉడికించి తిన్నా శరీర కణాలను మరమ్మతు చేస్తాయి. ఉష్ణాన్ని తగ్గిస్తాయి.
మన శరీరంపై అన్ని తైలాలూ ఒకే విధంగా పనిచేయవు. వేడి వాతావరణంలో అధిక ఉష్ణం నుంచి ఉపశమనం పొందడానికి ఆముదం నూనె మంచిదని సద్గురు అభిప్రాయం. బొడ్డు, ఛాతి మధ్యభాగం, చెవుల వెనకభాగాల్లో కొన్ని చుక్కల ఆముదం నూనె రాసుకుంటే నిమిషాల్లోనే గణనీయమైన ఉపశమనం లభిస్తుంది.
యోగశాస్త్రంలో వీటిని శక్తి కేంద్రాలుగా పరిగణిస్తారు. ఇక్కడే శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియ వేగంగా పనిచేస్తుంది. శరీరధర్మ శాస్త్రం ప్రకారం ఈ భాగాల్లో నూనె రాయడం సహానుభూత నాడీ (పారాసింపథెటిక్ నర్వస్) వ్యవస్థను క్రియాశీలం చేస్తుంది. దీంతో మనకు విశ్రాంతిగా అనిపిస్తుందని సద్గురు మాట.
ఎండకాలం, ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు తేలికాహారం మంచిది. ఆహారాన్ని శక్తినిచ్చేది, శక్తిని హరించేది, తటస్థంగా ఉండేది అని సద్గురు మూడు రకాలుగా వర్గీకరిస్తారు. వెల్లుల్లి, ఉల్లి, పులియబెట్టిన పదార్థాలు శక్తిని హరించే వర్గంలోకి వస్తాయి. వీటిని తింటే ఉష్ణం, బద్ధకం పెరుగుతాయి.
వీటికి బదులుగా బూడిద గుమ్మడి, మొలకెత్తిన పప్పుధాన్యాలు, తాజా పండ్లు, కొబ్బరినీళ్లు, దోసకాయ, వేపపూలు లాంటివి తీసుకోవాలి. దీంతో శరీరం చల్లగా ఉంటుంది. మానసిక స్పష్టత వస్తుంది. సుస్థిరమైన శక్తి లభిస్తుంది. ఇవి ఆకలిని తీర్చడం మాత్రమే కాదు.. లోపలి శరీర వ్యవస్థను క్రమబద్ధీకరిస్తాయి.