పిల్లలకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యమూ అంతే ప్రధానం. బుద్ధిమాంద్యంలాంటి పెద్ద జబ్బులు ఉంటే తప్ప మనం చిన్నారుల మానసిక స్థితి గురించి ఆలోచించం. కుటుంబం, చుట్టుపక్కల పరిస్థితులు పిల్లల మనసులను చాలా ప్రభావితం చేస్తాయి. చికాకులు, కోపం.. తదితర నెగెటివ్ ఉద్వేగాలకు దారితీస్తాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి బాలలను కాపాడేందుకు ‘కమ్యూన్’ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నడుపుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులు. వందలమంది చిన్నపిల్లలు, టీనేజర్లకు ఈ వేదిక ద్వారా మాట సాయం అందిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన స్నేహ కొలుకూరు, అర్చన ప్రభాకర్ చదువుల తర్వాత ‘టీచ్ ఫర్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అందులో భాగంగా పేద పిల్లలు చదువుతున్న బడులకు వెళ్లి పాఠాలు చెప్పేవారు. కొందరు పిల్లలు క్లాసులు జరుగుతున్నంత సేపూ ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించడం ఆ ఇద్దరి దృష్టిని దాటిపోలేదు. వారిలో అసహనం, కోపం ఎక్కువని తెలుసుకున్నారు. దీనికి కారణాలు వెతికే పనిలోపడ్డారు. ఒక్కొక్కరిదీ ఒక్కో ఇబ్బంది. తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పిల్లలు కొందరైతే.. ఇంట్లో అమ్మానాన్నల గొడవలతో సతమతం అవుతున్న చిన్నారులు మరికొందరు. పేదరికం, కుటుంబ పరిస్థితులు.. తదతర అంశాలన్నీ పిల్లల ప్రవర్తన మీదా ప్రభావం చూపుతున్నాయని అర్థమై పోయింది. మనసు బావుంటేనే చదువులు బావుంటాయి, ఆలోచనా బావుంటుంది. అందుకే విద్యార్థుల మానసిక పరిస్థితిని చక్కదిద్దాలని భావించారు. ఆ ఆలోచనలోంచి ప్రాణం పోసుకున్నదే ‘కమ్యూన్’ కార్యక్రమం. ‘కమ్యూనిటీ’లోంచి పుట్టిన పేరిది.
నిపుణుల సాయంతో…
కొద్దిరోజులు తమకు తెలిసినంతలో పిల్లలకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు స్నేహ, అర్చన. అదే సమయంలో వీళ్ల ఆలోచనలు నచ్చి కార్యక్రమంలో భాగమయ్యారు ఆరవల్లి వైష్ణవి. టీనేజర్ల ప్రవర్తనను తీర్చిదిద్దాలంటే.. నిపుణులతో తరగతులు నిర్వహించడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలో ‘పాజ్ ఫర్ పర్స్పెక్టివ్’ అనే కౌన్సెలింగ్ సంస్థతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఈ సంస్థకు చెందిన కౌన్సెలర్లు పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు తగినట్టు తరగతులు నిర్వహిస్తారు. అమ్మాయిలతో, అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు పిల్లలు ఏం ఆలోచించాలి, ఎలా స్పందించాలి? కోపం, చికాకు కలిగినప్పుడు.. తనకు ఎందుకలా అనిపిస్తుందన్నది ఎలా గమనించుకోవాలి.. తదితర అంశాల మీద తర్ఫీదు ఇస్తారు. ఒత్తిడి, కోపం తదితర ఉద్వేగాలకు గురైనప్పుడు ఎలా అదుపు చేసుకోవాలన్నదీ చెబుతారు. మనకు నచ్చని సంఘటన జరిగినప్పుడు లేదా ఇబ్బందికరఅనుభవాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో వివరిస్తారు. శిక్షణ కథనాత్మక పద్ధతిలో సాగుతుంది. దని వల్ల పిల్లల్లో మానసిక పరిణతి పెరుగుతుంది.
కొవిడ్ రోజుల్లో..
అసలే కొవిడ్ సమయం కావడంతో తొలుత ఆన్లైన్ క్లాసులు నిర్వహించి, హెల్ప్‌లైన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసేవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆరు పాఠశాలల్లో ఆరు నుంచి పది తరగతుల పిల్లలకు వారానికి రెండుసార్లు కౌన్సెలర్ల ద్వారా నేరుగా తరగతులు నిర్వహిస్తున్నది కమ్యూన్. వీటిలో ప్రభుత్వ పాఠశాలలతోపాటు, పేద పిల్లలు చదువుతున్న ప్రైవేటు పాఠశాలలూ ఉన్నాయి. విద్యా సంస్థలు అనే కాదు, మానసిక శిక్షణ అవసరం ఉన్న ప్రతి బాలుడు, బాలిక దగ్గరికీ వెళ్లాలన్నది కమ్యూన్ ఆలోచన. బలమైన మనసులే బలమైన సమాజానికి పునాది. ‘కమ్యూన్’ ప్రయాణమూ అటువైపేనని ఆత్మ విశ్వాసంతో ప్రకటిస్తారు వ్యవస్థాపకులు.. స్నేహ, వైష్ణవి, అర్చన.
…?లక్ష్మీహరిత ఇంద్రగంటి