వర్షకాలంలో పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధులలో హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ (HFMD) ఒకటి. ఇది కాక్సకీ ఎ16, ఎంటెరో వైరస్ వల్ల వస్తుంది. ఐదు నుంచి ఏడు సంవత్సరాల పిల్లలలో ఎక్కువ. కాబట్టి, పిల్లల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
లక్షణాలు: చేతులు, కాళ్లు, నోట్లో కురుపులు. ఒకటి రెండు రోజులకు ఈ కురుపులు మోకాళ్లు, మోచేతులు, పిరుదులపై కూడా కనిపించవచ్చు. కొద్దిపాటి జ్వరం, గొంతునొప్పి, నోటిమంట ఉంటాయి. కురుపులు 2-6 మి.మీ. పరిమాణానికి చేరుకొని 7-14 రోజులలో ఎండిపోతాయి. పొక్కులు కట్టి రాలిపోతాయి. క్రమంగా మానిపోతాయి. అరుదుగా కురుపులలో రక్తం కనిపిస్తుంది. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఆ కురుపులు నడుము, జననాంగాలపై వచ్చి చర్మం రాలిపోవచ్చు. ఎలర్జీ ఉన్నవారిలో వ్యాధి తీవ్రత ఎక్కువే.
వ్యాప్తి: ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుల మలం, లాలాజలం, దగ్గు, తుమ్ముల ద్వారా వచ్చే తుంపర్లలోని వైరస్ నోటి ద్వారా కడుపులోకి ప్రవేశిస్తుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకూ ఈ వైరస్ వ్యాధిగ్రస్తుల శరీరంలో జీవించే ఉంటుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 3-7 రోజులకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
ఇతర సమస్యలు: అతి తక్కువ మందిలో వైరల్ మెనింజైటిస్, మెదడువాపునకు దారి తీయవచ్చు. కొందరిలో 3-8 వారాల తర్వాత గోళ్లు ఊడిపోవడం కనిపిస్తుంది.
నివారణ: వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలి. బాధితులు వాడిన వస్తువులు, బొమ్మలు, పాత్రలు ముట్టుకోవద్దు. చేతులను తరచుగా సబ్బునీటితో కడుక్కోవాలి. పిల్లలు మరుగుదొడ్డిలోనే మలవిసర్జన చేసేలా చూడాలి. ఇతర ప్రదేశాలలో కాలకృత్యాలు తీర్చుకున్నట్టయితే.. వెంటనే శుభ్రం చేయాలి.
వైద్యం: ఇది వైరల్ వ్యాధి కాబట్టి దానంతట అదే తగ్గిపోతుంది. జ్వరం, నొప్పులకు పారసిటమాల్, నోటి మంటలకు ఓరల్జెల్ వాడవచ్చు. చిట్కా వైద్యాలతో కాలక్షేపం మంచిది కాదు.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు