పల్లెటూరి వాసన తెలియకుండా పెరిగిందామె! కానీ, ఇప్పుడు పల్లెదనాన్ని పరిచయం చేస్తూ ఆంత్రప్రెన్యూర్‌గా రాణిస్తున్నది. ప్రకృతి ఆరాధకుడైన తన భర్త కలలను సాకారం చేస్తూ.. ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టింది. పచ్చని పొలాలు, పండ్ల తోటల నడుమ మండువా లోగిలి నిర్మించి.. అతిథులకు ఆహ్వానం పలుకుతున్నది. పశుపక్ష్యాదుల పలకరింపులతో అలరారే ఈ సంప్రదాయ గృహాన్ని జాయ్‌ఫుల్ వీకెండ్ డెస్టినేషన్‌గా నిలిపింది. పంటపొలాలు లేనివాళ్లు, పల్లెలకు దూరంగా వచ్చినవాళ్లు.. వారాంతంలో ఇక్కడికి వచ్చి ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఏనాడూ పల్లె వాతావరణం తెలియని ఆమె.. పట్నవాసులకు గ్రామీణ వాతావరణాన్ని అందిస్తున్నది. వ్యవసాయ క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మలిచిన గ్రీన్ ఎకర్స్ వ్యవస్థాపకురాలు తల్లా అనిత స్టార్టప్ స్టోరీ ఆమె మాటల్లోనే..
నేను పుట్టింది హైదరాబాద్‌లో. ఇక్కడే పెరిగాను. ఏనాడూ సిటీ దాటింది లేదు. పల్లెటూరు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఉద్యోగరీత్యా కొన్నాళ్లు అమెరికాలో ఉన్నాం. మా ఆయన తల్లా వెంకటేశ్వర్‌కు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి వ్యవసాయక్షేత్రంలోకి అడుగుపెట్టాను. అదే గ్రీన్ ఎకర్స్ వీకెండ్ హోమ్‌కు బీజం వేసింది. 1999లో సన్నిహితులతో కలిసి కొనుగోలు చేసిన ఐదు ఎకరాల భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టాం. అలా గ్రీన్ ఎకర్స్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినా అంతగా గిట్టుబాటు కాలేదు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న క్రమంలో గ్రీన్ ఎకర్స్ ఫార్మ్ స్టే ఆలోచన వచ్చింది. అలా పదేండ్ల కిందట మా వ్యవసాయ క్షేత్రంలో అర ఎకరం విస్తీర్ణంతో తాతలనాటి మండువా ఇల్లు కట్టించాం. చుట్టూ ఆరు ఎకరాల్లో తోటలు పెంచి వీకెండ్ డెస్టినేషన్ హోమ్‌గా దీనిని తీర్చిదిద్దాం. నిత్యం బిజీగా ఉంటూ, ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కలుసుకోవడానికి ఓ అందమైన వేదిక ఇది. మా ఆయన సహకారంతో మా వ్యవసాయక్షేత్రాన్ని ఎకో ఫ్రెండ్లీ విహార కేంద్రంగా మలిచాను.
కేరళ, కొచ్చి లాంటి ప్రాంతాలను సందర్శించినప్పుడు అక్కడ కనిపించే మండువ లోగిళ్లు నాకెంతో నచ్చాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని దీనిని రూపకల్పన చేశాను. వీకెండ్లో సరదాగా పంటపొలాలు, పచ్చని చెట్ల నడుమ స్వచ్ఛమైన ప్రాణవాయువుతో పునరుత్తేజం కలిగించే ఫార్మ్ స్టే హోమ్ నిర్మాణం కోసం ఎంతగానో అధ్యయనం చేశాను. ఎన్నో పర్యాటక ప్రాంతాలను సందర్శించి అరుదైన కళాకృతులు సేకరించా. నిర్మాణ శైలిలోనూ ప్రత్యేకత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నా. కనుచూపు మేరలో చిక్కటి పచ్చదనంతో దీనిని తీర్చిదిద్దాం. అర ఎకరంలో విస్తరించిన ఈ ఇంట్లో ఆరు పడకగదులు, విశాలమైన సిట్ అవుట్, ఓపెన్ జిమ్ ఏర్పాటుచేశాం. ఒకసారి గ్రీన్ ఎకర్స్‌లో అడుగుపెడితే.. ప్రపంచాన్ని మర్చిపోయి సరదాగా కాలం గడిపేయొచ్చు.
యాంత్రిక జీవనంతో పోటీపడుతూ బంధాలకు దూరమైన ఎంతోమంది ఈ పచ్చని పొలాలు, పక్షుల రాగాల నడుమ సేదతీరుతున్నారు. కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్న ఈ తరానికి మన మూలాలను పరిచయం చేయాలన్న మా సంకల్పం దీంతో నెరవేరింది. గ్రీన్ ఎకర్స్ చుట్టూ పది ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తున్నాం. ఇక్కడ పండించిన వాటినే అతిథులకు భోజనంగా అందిస్తున్నాం. గ్రీన్ ఎకర్స్కు ఒకసారి వచ్చిన వారంతా మళ్లీ మళ్లీ రావడానికి ఉత్సుకత చూపుతున్నారు. పంట పొలాల మధ్య హాయిగా కాలం గడుపుతున్నారు. హైదదాబాద్తోపాటు బెంగళూరు నుంచి కూడా గ్రీన్ఎకర్స్లో గడిపేందుకు ఔత్సాహికులు వస్తున్నారు. విదేశాల్లో స్థిరపడి, స్వదేశానికి వచ్చినవాళ్లు… తమ బంధువులతో ఇక్కడ గెట్ టుగెదర్ జరుపుకొంటున్నారు.
ఈ స్టే హోమ్ నిర్మాణ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. దీనికోసం దక్షిణ భారతంలో కొన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించి, అక్కడ నుంచి పురాతన ఫర్నీచర్ సేకరించాను. ఈ లోగిలిలో కిటికీలు, ప్రధాన ద్వారాలు, తలుపులు, స్తంభాలన్నీ కూడా వంద సంత్సరాల కిందట డిజైన్ చేసినవాటి శైలిలో ఉంటాయి. ఇంటి ఆవరణ, పరిసరాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. పిల్లగాలికి ఊగుతూ చిన్నారులను జోలపుచ్చే ఊయలలు, నులక మంచాలు, పడుకునేందుకు పెద్ద పీటలు ఇలా ఇక్కడున్నవన్నీ అచ్చెరువొందిస్తాయి. యూఎస్‌లో స్థిరపడిన మా పిల్లలు కరోనా సమయంలో ఇక్కడికి వచ్చారు. మూడు నెలలు గ్రీన్ ఎకర్స్‌లో మేమంతా హాయిగా గడిపాం. అదే ఆనందాన్ని నాతోపాటు మరెన్నో కుటుంబాలకు అందిస్తున్నాను. ఇంతకీ మా గ్రీన్ ఎకర్స్ ఫార్మ్ స్టే హోమ్ ఎక్కడున్నది చెప్పలేదు కదూ! తెలంగాణలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట క్షేత్రానికి దగ్గర్లో, కూనురు గ్రామ సమీపంలో ఈ ప్రకృతి నిలయం ఉంది.