మానవ చరిత్రలో మరో నవ శకం ఆరంభం కానున్నది. నేటి నుంచి.. సరికొత్త తరం ఈ ప్రపంచంలో అడుగుపెడుతున్నది. 2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 మధ్య జన్మించేవారిని.. ‘జెన్-బీటా’గా చెబుతున్నారు. ‘జెన్-ఆల్ఫా’కు నిన్నటితోనే ఫుల్స్టాప్ పడిపోగా.. ఇక ‘జెన్-బీటా’ హవా మొదలుకానున్నది. 2010-2024 మధ్య పుట్టినవారిని ‘జనరేషన్-ఆల్ఫా’ అని పిలుస్తున్నారు.
దీనిని అనుసరించే.. రాబోయే తరానికి ‘జనరేషన్-బీటా’గా పేరు పెట్టారు. వీరిని ముద్దుగా.. ‘బీటా బేబీస్’ అని పిలవనున్నారు. ఈ జనరేషన్ అద్భుతమైన సాంకేతిక ప్రపంచంలో పెరగనున్నది. స్మార్ట్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినప్పటికీ.. జెన్-ఆల్ఫా కన్నా మిన్నగా.. వీటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేది మాత్రం జెన్-బీటానే! వారి రోజూవారి జీవితంతోపాటు చదువు, ఆరోగ్య సంరక్షణ, వినోద కార్యకలాపాల్లోనూ అత్యాధునిక సాంకేతికత వారికి వెన్నుదన్నుగా నిలవనున్నది.
అయితే, వీరికి ఎంత అధునాతన సాంకేతికత అందివచ్చినా.. అంతేస్థాయిలో సవాళ్లూ ఎదురుకానున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులు, పట్టణీకరణ, పెరుగుతున్న ప్రపంచ జనాభా.. వాటి దుష్ఫలితాలను జెన్-బీటా వారసత్వంగా పొందనున్నది. అందుకే, వీరు తమ ముందటి తరాల కన్నా మిన్నగా.. పర్యావరణ స్పృహతో మెలగాల్సి ఉన్నది. లేకుంటే.. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో విషయం.. వీరిలో చాలామంది 22వ శతాబ్దపు ప్రారంభాన్ని చూసే అవకాశం కూడా ఉన్నది.