ఏ గీతానికైనా తన స్వర మధురిమతో ప్రాణంపోస్తారు.. గీతా మాధురి. ఆ గాయని ఇప్పుడు ఇల్లాలిగా, తల్లిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ట్గా, యాంకర్‌గా ఎన్నో బాధ్యతలు చక్కబెడుతున్నారు. తాజాగా ‘జీ తెలుగు సరిగమప’ పాటల పోటీలకు మెంటర్‌గా.. మట్టిలోంచి వచ్చిన మాణిక్యాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నిటికీ మించి ప్రకృతి అనే గడుగ్గాయికి తల్లిగా మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ కబుర్లన్నీ..
మీరు స్వతహాగా గాయని. ఇప్పుడు ఓ పాటల బృందానికి మెంటర్! ఈ జర్నీ ఎలా అనిపిస్తున్నది?
ఇదొక ఎమోషనల్ జర్నీ. అన్ని ‘సరిగమప’ షోలు ఒక ఎత్తయితే.. ఈ సరికొత్త సీజన్ మరో ఎత్తు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి పల్లెనుంచీ ఒక పోటీదారు వచ్చారు. దాదాపు 12 వేల మందిని వడపోసి, అంతిమంగా 22 మందిని ఎంపిక చేశారు. అంతా మట్టిలోని మాణిక్యాలే. వారికి మెంటర్‌గా వ్యవహరించడం నా అదృష్టం. నా టీమ్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నాను. పాట ఎంపిక నుంచి స్టేజీ మీద సంగీతానికి తగినట్టు హావభావాలు పలికించడం వరకూ ప్రతీది గైడ్ చేస్తున్నాను. పొరపాట్లు ఉంటే సరిదిద్దుతున్నాను. ఇండస్ట్రీకి ఎప్పుడూ కొత్త నీరు వస్తూనే ఉండాలి.
‘జై బాలయ్య’ పాట బాగా పాపులర్ అయ్యింది. పాప పుట్టాక పాటలకు కొంత గ్యాప్ ఇచ్చినట్టున్నారు?
(చిరునవ్వుతో) నా ముద్దుల బిడ్డపేరు దాక్షాయణి ప్రకృతి. చాలా అల్లరి పిల్ల. ప్రకృతితో ఉంటే సరికొత్త లోకంలో ఉన్నట్టే. పాప పుట్టాక కొంత గ్యాప్ ఇచ్చిన మాట వాస్తవమే. తల్లిగా తన బాధ్యత చూసుకోవాలి కదా! అలా అని పాటలకు పూర్తిగా దూరంగానూ లేను. ఆ గ్యాప్‌లో ఆల్బమ్స్ పాడాను. ‘అఖండ’లోని ‘జై బాలయ్య’ పాట నాకు సూపర్ హిట్ ఇచ్చింది. తమన్‌గారు స్వరపరిచిన ఈ గీతం యూత్‌లో క్రేజీగా మారింది. చాలామంది అభినందనలతో ముంచెత్తారు. గాయనిగా అంతకంటే ఏం కావాలి?
పాప మీ పాటలు పాడుతూ.. మిమ్మల్ని అనుకరిస్తున్నది. మీకెలా అనిపిస్తుంది?
అమ్మో! ఆ వీడియోలు మీరూ చూశారా? ప్రకృతి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా పాటల్ని తను పాడటం ఒక మధురమైన అనుభూతి. నన్ను ఇమిటేట్ చేస్తూ పాటడం మరచిపోలేని జ్ఞాపకం. ప్రేమలో ఉన్నప్పుడు, పెండ్లికి ముందు భవిష్యత్తును ఊహించుకుంటూ.. హెల్దీ బేబీ పుట్టాలని, తను మా ఇద్దరంత అల్లరి చేయాలని నేనూ నందూ అనుకునే వాళ్లం. ప్రకృతిని చూస్తే.. ‘అంతకు మించి’ అనిపిస్తున్నది.
‘అంతా తల్లి పోలికే’ అని ఎవరైనా టీజ్ చేస్తే మీకు కోపం వస్తుందా?
(సరదాగా వాదులాడుతూ) లేదు. లేదండీ! అంతా తూచ్. తను (ప్రకృతి) ఓ గడుగ్గాయ్. తల్లిపోలిక అస్సలు కాదు. అంతా తండ్రి పోలికే. ఒకేసారి రెండుమూడు విషయాల మీద దృష్టిపెడుతుంది. ఆడుకుంటూనే, మేం ఏం మాట్లాడుకుంటున్నామో వింటుంది. అది మాత్రం కచ్చితంగా తండ్రి పోలికే (బిగ్గరగా నవ్వుతూ). నాలా పాటలు పాడుతుందేమో కానీ, అల్లరిలో నందుకు ఏమాత్రం తీసిపోదు. నందు కూడా నన్ను ఒక్కోసారి అలానే ఇమిటేట్ చేస్తుంటాడు. సరదాగా టీజ్ చేస్తుంటాడు. అందులోనూ తన ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమకు, వాళ్లిద్దరి చిలిపి అల్లరికి నేను సదా పాత్రురాలినే (నవ్వుతూ..). అందుకే వాళ్ల నాన్న ప్రకృతి పేరు మీద ఓ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేశాడు.
మీ ఇద్దరిదీ పాటతో పరిచయమా? ‘అతిథి’ షార్ట్‌ఫిల్మ్ పరిచయమా? మీ ప్రేమ పెండ్లి గురించి..
మా ఇద్దరి పరిచయం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగింది. కొన్నాళ్లకు ఫోన్లో మాట్లాడుకున్నాం. తను అప్పటికే యాక్టింగ్ వైపు ఉన్నాడు. తనను డిస్ట్రబ్ చేయాలని అనిపించలేదు. ఎవరికైనా ఆ దశలో కెరీర్ ముఖ్యం. తర్వాత మరో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశాం. కొద్దిరోజుల తర్వాత ప్రసాద్ ల్యాబ్స్‌లో డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు. అదే సమయంలో నేనూ అక్కడున్నా. అలా కొంతసేపు మాట్లాడుకున్నాం. ‘100% లవ్’ ఆడియో లాంచ్‌లో మళ్లీ కలుసుకోవడం.. మెసేజ్‌లు, కాల్స్.. ఇలా ప్రేమ చిగురించింది. రెండేండ్లు ప్రేమలో ఉన్నాం. నేను ఒక్కతే కూతుర్ని కాబట్టి.. నా నిర్ణయాన్ని మావాళ్లు గౌరవిస్తారని తెలుసు. అప్పటికే వాళ్లకు నందు గురించి తెలియడంతో ఛేజింగులు, ఫైటింగ్‌లు లేకుండానే ఇంట్లో ఒప్పించాం. పెండ్లి చేసుకున్నాం.
‘గీతానంద నిలయం 306’లో ఆనందాల సందడి గురించి?
మా ఇంటికి ‘గీతానంద నిలయం’ అని పేరు పెట్టాం. ఆనందాలు, భావోద్వేగాలూ కలగలిసిన సౌధం అది. ఆ నాలుగు గోడల మధ్య మా చిన్నచిన్న ఆనందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మధ్య తరగతి సంతోషాలు’ అంటూ క్యాప్షన్స్ ఇస్తుంటాడు నందు.
పాడుతున్నారు. డబ్బింగ్ చెబుతున్నారు. యాంకరింగ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో యాక్టర్‌గా కూడా గీతా మాధురిని చూడొచ్చా?
అమ్మో! యాక్టింగా (ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..) నన్ను అడిగితే కచ్చితంగా ‘నో’ అనే చెబుతాను. నాకంత టాలెంట్ లేదు (నవ్వుతూ). ఒకవేళ భవిష్యత్‌లో నందు ప్రోత్సహిస్తే వెళ్తానేమో. కచ్చితంగా ఇప్పుడైతే కాదు. ఒకవేళ నేను యాక్టింగ్ వైపు వెళ్తే అదొక మిరాకిల్ అవుతుంది (చిరునవ్వు).
సంగీతం నేర్చుకున్నారు? ఎలా పాడాలో తెలుసుకున్నారు? భవిష్యత్‌లో గురువుగా మారతారా?
ఇప్పుడేం లేదండి. నేను పదేండ్ల పాటు గట్టిగా నేర్చుకుంటేకానీ అది సాధ్యం కాదేమో. సంగీతం ఓ సముద్రం. నా దగ్గరకు వచ్చిన వారికి ఎలా పాడాలో చెప్పగలను. ఒకవేళ గురువుగా ఉండాలనుకుంటే, ముందుగా చాలా సంగీత డిగ్రీలు సాధించాలి. మరింత సాధన చేయాలి కూడా.
కొవిడ్ సమయంలో నందూ, మీరూ కలిసి బెడ్స్, ఆక్సిజన్ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ చాలామందికి సాయం చేశారు. ఎలా సాధ్యమైంది? మీకంటూ ఓ నెట్వర్క్ ఏదైనా ఉందా?
నెట్వర్క్ అంటూ ఏమీ లేదు. కాకపోతే నేనూ, నందూ ఆ సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నాం. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో. మాకు తెలిసిన సమాచారాన్ని, భోజన అవసరాలను ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేసేవాళ్లం. అభిమానులు స్పందించి మెసేజ్ చేసేవారు. పదిన్నర లక్షలమంది ఫాలోవర్స్ సాయంతో మేమిచ్చే సమాచారం చాలామందికి ఉపయోగపడింది. అదొక ఆత్మసంతృప్తి.
– డప్పు రవి