కొందరికి ఒంటరిగా ఉండటం ఇష్టం! మరికొందరికి అది అనివార్యం. మనకు అందరూ దూరమైతే.. మిగిలేది ఒంటరితనం! మనమే అందరికీ దూరంగా వెళ్తే.. ఏకాంతం! ఇలా ఏకాంతంలో ఆనందాన్ని వెతుక్కునే అమ్మాయిలు ఇప్పుడు ఎంతోమంది. అయితే, అమ్మాయిలు ఇలా ఒంటరిగా జీవించడం తప్పుకాదు. సరైన భద్రతా చర్యలు పాటించకపోతేనే.. లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నగరాల్లో ఒంటరిగా నివసించే మహిళల కోసం.. ఈ భద్రతా చిట్కాలు!
అద్దె ఇండ్లలో ఉండేవారిలో చాలామంది ఇంటి ఓనర్లు ఇచ్చిన తాళాలనే వాడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో డూప్లికేట్ తాళాలు వేరేవాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే.. మీ ఇంటి తాళం మీరే కొనుక్కోండి. ఓ సెట్‌ను ఎప్పుడూ మీతోనే ఉంచుకోండి. మిగిలిన వాటిని సురక్షితంగా దాచుకోండి.
ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. మీ భద్రత గురించి పట్టించుకోవడంలో హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ముందుంటుంది. అందుకే, అత్యాధునిక హోమ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఇంట్లో అమర్చుకోండి. అనుమతి లేకుండా ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఇది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అత్యవసర సమయాల్లో మీకు సహాయపడుతుంది.
ఏ సమయంలోనైనా బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేయడానికి మొబైల్ ఫోన్ అత్యుత్తమ మార్గం. అందుకే, వీలైతే రెండు ఫోన్లు దగ్గర పెట్టుకోండి. రెండిటినీ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచండి. ఒక మొబైల్లో చార్జింగ్ లేకపోయినా.. మరొకటి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
మీరు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా.. ఎప్పుడైనా మెడికల్ ఎమర్జెన్సీ రావొచ్చు. ఒంటరిగా నివసించేవారు ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను తప్పకుండా ఉంచుకోవాలి. దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.