ఆహా: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: అభిషేక్, భ్రమరాంబిక, కృష్ణ, రేవతి,
లక్ష్మి తదితరులు, దర్శకత్వం: సాయి వనపల్లి
పచ్చని పల్లెలు; పెళ్లి వేడుకలు; నవ దంపతుల గిల్లికజ్జాలు.. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు తెరకెక్కాయి. చూసిన ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తాయి. ఎందుకంటే, తెలుగువారికి ఇలాంటి కథలు ఇట్టే ఎక్కుతాయి. పల్లె మనుషులు, వాతావరణం అన్నీకూడా నచ్చేస్తాయి. అలాంటి పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన సిరీస్ ‘ఆనందలహరి’. ఎనిమిది ఎపిసోడ్లతో ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నది. ఫీల్‌గుడ్ సిరీస్‌గా వీక్షకుల మన్ననలు పొందుతున్నది. కథలోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరి సర్పంచ్ కొడుకు.. ఆనంద్ (అభిషేక్). స్మార్ట్ లయర్. బీటెక్‌లో ఫెయిల్ అయినా.. పాసయ్యానని చెప్పి, తాగి తిరుగుతూ ఉంటాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని తండ్రి ఆశ పడతాడు. పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా అమ్మాయి లహరి (భ్రమరాంబిక). ఇంట్లో చాలా క్రమశిక్షణలో పెరుగుతుంది. మనసు లోతుల్లో మాత్రం.. స్వతంత్రం, నగర జీవితం, ఉద్యోగం లాంటి అనేక కలలతో బతుకుతుంటుంది. పెళ్లి అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ, అనుకోని ఓ సంఘటనతో తల్లి ఆమెకు వెంటనే పెళ్లి నిశ్చయం చేస్తుంది. పెళ్లిని చెడగొట్టడానికి లహరి ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వవు. అలా.. ఆనంద్-లహరి వివాహబంధంలోకి అడుగు పెడతారు. పెళ్లి తర్వాతే.. అసలు కథ ఆరంభమవుతుంది.
ఇద్దరూ హైదరాబాద్‌లో కాపురం పెట్టి.. కొత్త జీవితం ప్రారంభించాలని పెద్దలు సూచిస్తారు. స్వేచ్ఛను కోరుకునే లహరి.. అందుకు ఓకే అంటుంది. ఆనంద్ మాత్రం.. తనకు ఊరిలోనే స్వేచ్ఛ ఉందని, హైదరాబాద్ వెళ్లనని చెబుతాడు. చివరికి అందరూ కలిసి నవ దంపతులను హైదరాబాద్ పంపిస్తారు. నగరానికి వచ్చిన తర్వాత లహరి స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులకు హాజరవుతూ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆనంద్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా తాగుతూ తిరుగుతుంటాడు.
తాగుడు కోసం ఇంట్లో వస్తువులను అమ్మేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఇద్దరికీ గొడవలు మొదలవుతాయి. విడిపోదామనుకునే వరకూ వెళ్తారు. మరి.. చివరికి ఏం జరిగింది? ఇద్దరూ కలిసే ఉంటారా? విడిపోతారా? లహరి కోరుకున్న ఉద్యోగం, స్వేచ్ఛా ఆమెకు దొరుకుతాయా? ఊరి సర్పంచ్ కొడుకైన ఆనంద్.. జీవితంలో స్థిరపడతాడా? తెలియాలంటే.. ఈ సిరీస్ చూడాల్సిందే!