కాలేయాన్ని కబళించే ఫ్యాటీ లివర్.. ఇప్పుడు పిల్లల్లోనూ వేగంగా విస్తరిస్తున్నది. ఆరుబయటి ఆహారానికి అలవాటు పడిన చిన్నారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడమే ఈ సమస్యకు ప్రధానకారణంగా కనిపిస్తున్నది. అయితే, జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.
నేటితరం పిల్లలు ఇంటి భోజనం అంటేనే ముఖం చిట్లిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ లాంటి జంక్ ఫుడ్‌నే ఇష్టంగా తింటున్నారు. పెద్దలు కూడా.. వారికి అలాంటి ఆహారాన్నే ఎక్కువగా అందిస్తున్నారు. ఈక్రమంలో పిల్లలు ఊబకాయంతోపాటు ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. బాల్యంలో సమస్య చిన్నగానే అనిపించినా.. భవిష్యత్తులో గుండె జబ్బులు, షుగర్, ఇన్సులిన్ సమస్యలు వంటివి రావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఫ్యాటీ లివర్ రావడానికి గల ప్రధాన కారణాలను వివరిస్తున్నారు. టీవీ చూడటం, ఫోన్/ ట్యాబ్‌లో వీడియో గేమ్స్ ఆడుతూ.. ఎక్కువ సమయం స్క్రీన్లకే అతుక్కుపోతున్నారు. ఆరుబయట ఆటలకు దూరమవుతున్నారు. దాంతో, శారీరకంగా
బలహీనంగా మారుతున్నారు. ఇక ఆహారం విషయంలోనూ బయటి తిండికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సాఫ్ట్ డ్రింక్స్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటున్నారు. ఇలాంటి బయటి ఆహారంలో అధికశాతం ఫ్రక్టోజ్, హానికరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ కాలేయంలో పేరుకుపోయి.. జీర్ణక్రియపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్‌కు దారితీస్తున్నాయి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో అజీర్ణం, కడుపు నొప్పి, తలనొప్పి, బరువు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీన్ని నివారించడానికి జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవాలి.