‘ఓ విశ్వాసులారా! నేను సెలవు తీసుకుంటున్నాను.. వచ్చే వసంతానికి మళ్లీ మన కలయిక సాధ్యమవుతుందో లేదో ఎవరికి తెలుసు? నేను వెళ్లేలోపే, నేను తెచ్చిన ఆ దైవకృపను అక్కున చేర్చుకోండి.. ఆ వెలుగు మీ ఆత్మలలో నిరంతరం ప్రకాశించనివ్వండి’ నెలవంక రాకతో ఈ పవిత్ర మాసం ముగియనుండగా, ఈ మాటలు కేవలం క్యాలెండర్ మార్పులా కాకుండా, ఒక ఆత్మీయ అతిథి పలుకుతున్న వీడ్కోలులా వినిపిస్తున్నాయి. ఆత్మపరిశీలనకు, నిగ్రహానికి ప్రతీక అయిన రంజాన్ ఇప్పుడు సెలవు తీసుకుంటున్నది. అయితే వెళ్తూ వెళ్తూ అది మన ముందు ఒక వేధించే ప్రశ్నను ఉంచుతున్నది.. ‘మనం కేవలం భోజన సమయాలను మార్చుకున్నామా? లేక మనల్ని మనం మార్చుకున్నామా?’ అని.
భక్తి కూడా ఒక ప్రదర్శనలా మారిపోతున్న ఈ రోజుల్లో, నిజమైన ఆరాధన ఆ నిశ్శబ్దంలో చిందించే కన్నీటి చుక్కలోనే ఉంటుంది. చరిత్రలో మనం చూసే మహనీయులు, ప్రవక్తలు తమ భక్తి పట్ల ఎన్నడూ గర్వపడలేదు. దానికి బదులుగా, వారు అర్ధరాత్రి వేళల్లో తమ బలహీనతలను ఒప్పుకొంటూ, దైవ కరుణ కోసం విలపించారు. దీని వెనుక ఒక లోతైన మానవీయ తర్కం ఉంది. ఒక పసిబిడ్డ పట్టుబట్టి ఏడుస్తుంటే, ఏ తల్లిదండ్రులైనా కరగకుండా ఉంటారా? ఐహికమైన బంధమే అంత మృదువుగా ఉంటే, మరి 70 మంది తల్లుల కంటే మిన్నగా ప్రేమించే ఆ సృష్టికర్త, తన భక్తుడు ఆర్తితో వేడుకుంటే ఎందుకు కరగడు? కరుణా ద్వారాలు ఎప్పుడూ మూసి లేవు.. మనం హృదయపూర్వకంగా తట్టడం మానేశాం అంతే! నేటి యువత రంజాన్‌ను ఒక ‘ఆధ్యాత్మిక బూట్ క్యాంప్’లా భావించాలి.
ఒక సైనికుడు కఠినమైన శిక్షణను కేవలం వ్యాయామం కోసం చేయడు, తన దేశ సరిహద్దును కాపాడటం కోసం చేస్తాడు. ఒక విశ్వాసికి ఆ సరిహద్దు ‘దీన్’ (ధర్మం-నైతికత). శత్రువు: బయట ఉన్న శక్తులు కాదు.. మనలోని అహం (నఫ్స్), మనల్ని చెడు వైపు నడిపించే ప్రేరణలు. కవచం: తఖ్వా (దైవచింతన). గడిచిన 30 రోజులుగా మనం అలవర్చుకున్న క్రమశిక్షణ ఆకలిని తట్టుకోవడం, నాలుకను అదుపులో ఉంచడం, దానగుణం.. ఇవన్నీ ఒక రిహార్సల్ మాత్రమే. నెలవంక కనిపించగానే మళ్లీ పాత అలవాట్లలోకి జారిపోతే, ఈ శిక్షణ విఫలమైనట్టే. రంజాన్ నిజమైన విజయం ఈ ఒక్క నెలలో కాదు, మిగిలిన పదకొండు నెలల మన జీవనశైలిలో ప్రతిఫలించాలి.
ఈ మాసం ముగింపు దశలో, మనల్ని మనం ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఖురాన్ ప్రకారం నిజమైన పుణ్యాత్ముడికి మూడు ప్రధాన లక్షణాలు ఉండాలి. అగోచరమైన దైవంపై విశ్వాసం: భౌతిక ప్రపంచానికి అతీతమైన నమ్మకం. నమాజు (ప్రార్థన): దైవంతో నిరంతర అనుసంధానం. దానగుణం: మన సంపదలో పేదవారికి కూడా వాటా ఉందని గుర్తించడం. స్వార్థం, ఆడంబరం పెరిగిపోతున్న ఈ కాలంలో, ఈ మూడు లక్షణాలే మనల్ని సరైన మార్గంలో ఉంచే దిక్సూచీలు. ఉపవాసం మనకు ఎదుటివారి ఆకలిని గుర్తుచేయకపోతే, అది కేవలం ఒక డైటింగ్ లాగే మిగిలిపోతుంది.
పదవులు, ఆస్తులు, హోదాల వెంట మనం జీవితాంతం పరుగెడుతూనే ఉంటాం. కానీ, రంజాన్ ముగిసిపోతున్న ఈ చివరి గడియల్లో, ఒక్కసారి మూలాల్లోకి వెళ్దాం. ఆ అనంతమైన దైవ ద్వారం వద్ద ఒక యాచకుడిలా నిలబడండి. గడిచిన కాలం పట్ల పశ్చాత్తాపంతో, రేపటి పట్ల ఆశతో మనసును నింపుకోండి. రంజాన్ వెళ్తూ వెళ్తూ ఇస్తున్న సందేశం ఒక్కటే! ‘నేను నీ మనసులోని చీకటి కోణాల్లో ఒక దీపం వెలిగించాను. రేపటి ప్రపంచపు గాలులకు ఆ దీపం ఆరిపోకుండా చూసుకో!’
-ముహమ్మద్ ముజాహిద్ ,96406 22076