అందం, ఆరోగ్యం కోసమే.. చర్మ సంరక్షణ చర్యలు చేపట్టాలి. అయితే, కొందరు స్కిన్‌కేర్ అతిగా తీసుకుంటారు. మరికొందరు తప్పుడు పద్ధతులు పాటిస్తుంటారు. దీనివల్ల మేలు కన్నా, చర్మానికి కీడే కలుగుతుంది. కాబట్టి, స్కిన్ కేర్ రొటీన్ చర్మానికి హాని కలిగిస్తుంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖం మీది జిడ్డు పోవాలని రోజుకు నాలుగైదు సార్లు ముఖాన్ని కడుతుగుతుంటారు. సబ్బులు, ఫేస్‌వాష్‌లతో రుద్దేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మంలోని సహజమైన నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా, చర్మం పొడిబారిపోతుంది. మంట పుడుతుంది. కొందరు ఒకేసారి వివిధ రకాల ఉత్పత్తులు వాడుతుంటారు. సీరమ్స్, క్రీములు, టోనర్లు ఒకేసారి వాడటం వల్ల.. వాటిలోని రసాయనాలు ఒకదానితో ఒకటి కలిసి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రెటినోల్, విటమిన్ సి వంటి శక్తిమంతమైన పదార్థాలను కలిపి వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక చర్మ తత్వానికి సరిపడని ఉత్పత్తులు వాడటం కూడా మంచిదికాదు.
జిడ్డు చర్మం ఉన్నవారు పొడిచర్మం కోసం తయారుచేసిన క్రీములు వాడితే.. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలు వస్తాయి. అలాగే చర్మానికి పడని రసాయనాలు, సువాసనలు కలిగిన ఉత్పత్తులతో అలర్జీలు దాడిచేస్తాయి. చర్మం మరింత కాంతిమంతంగా మెరవాలని.. స్క్రబ్స్, కెమికల్ పీల్స్ ఎక్కువగా వాడుతుంటారు. దీనివల్ల చర్మంపై ఉండే రక్షణ కవచం దెబ్బతింటుంది. ఫలితంగా, చర్మం ఎర్రబడటం, సున్నితంగా మారడం, చిన్న చిన్న మొటిమలు రావడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఎంత ఖరీదైన ఉత్పత్తులు వాడినా.. పగటిపూట సన్‌స్క్రీన్ వాడకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. పైగా, కొన్ని స్కిన్‌కేర్ ఉత్పత్తులు ఎండలో చర్మాన్ని మరింత సున్నితంగా మారుస్తాయి.
ఏదైనా ఉత్పత్తిని రాసుకున్నప్పుడు చర్మం మండుతున్నట్లు అనిపిస్తే.. సదరు ఉత్పత్తి మీకు పడటం లేదని అర్థం చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేయాలి. చర్మం విపరీతంగా పొడిబారిపోయినా, పొట్టు రాలినా, హఠాత్తుగా మొటిమలు వచ్చినా చర్మానికి హాని కలుగుతున్నట్లు గుర్తించాలి. ఇలా, చర్మంపై ఏదైనా కొత్త మార్పు కనిపిస్తే, వెంటనే స్కిన్‌కేర్ రొటీన్‌ను ఆపేయాలి. ఆయా ఉత్పత్తులను పక్కన పెట్టేసి.. కొన్ని రోజులపాటు తక్కువ రసాయనాలు ఉన్న మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లాంటివే వాడాలి. సమస్య తగ్గకపోతే బ్యుటీషియన్, డెర్మటాలజిస్టును సంప్రదించాలి.